ముందుగా ప్రకటించి ఉంటే బీజేపీని అభినందించేవాన్ని

SMTV Desk 2019-03-05 12:37:22  Pawan Kalyan, Jansena, Ongole Rally, TDP, YCP, BJP

అమరావతి, మార్చి 5: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం ఉదయం నుండి నెల్లూరు, బోగోలు ప్రాంతాల్లో రోడ్‌షో నిర్వహించారు. సాయంత్రం బోగోలులో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా, హామీలు అమలు చేయకుండా ప్రజలను బీజేపీ మోసం చేస్తోందని విమర్శించారు. తరువాత ఒంగోలు పయనమైన ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు.

సభలో ప్రసంగిస్తూ, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలతో కలిసి పనిచేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కేవలం ిపిఐ, సిపిఎంలతో కలిసి పోటీ చేస్తామని ఆయన తెలిపారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేశానని, కానీ టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని పవన్ కల్యాణ్ అన్నారు. యువతకు నిరుద్యోగ భృతి కాదు, ఉపాధి కోరుతున్నారని, బాధ్యతతో కూడిన ప్రభుత్వం రావాలని యువత కోరుకుంటోందని ఆయన అన్నారు. తనను బ్లాక్‌ మెయిల్‌ చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వాటికి భయపడే వ్యక్తిని కానని అన్నారు.

రాష్ట్రంలో దోపిడి రాజకీయాలు జరుగుతున్నాయని, అవి పోవాలంటే జనసేన అధికారం లోకి రావాలని అన్నారు. విశాఖ రైల్వే జోన్‌ ముందుగా ప్రకటించి ఉంటే బీజేపీని అభినందిచేవారని, ఎన్నికల సమయంలో ప్రకటించడం రాజకీయ దురుద్దేశమేనని ఆయన అన్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన నాయకులు కొందరి అభివృద్ధినే చూస్తున్నారని, చట్టసభల్లో కొందరికి మాత్రమే స్థానం కల్పిస్తున్నారని పవన్ అన్నారు.