గుజరాత్ పై వరాల జల్లు, పలు ప్రాజెక్ట్ లకు శ్రీకారం

SMTV Desk 2019-03-05 12:33:16  Narendra Modi, Gujarat, Projects, Green Signal, Rally

గాంధీనగర్, మార్చి 5: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్ లో సోమవారం నుండి పర్యటిస్తున్నారు. మోదీ రెండు రోజుల పాటు గుజరాత్ లో పర్యటించనున్నారు. మొదటి రోజే ప్రధాని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. నేటి పర్యటనలో ప్రధానమంత్రి సార్వజనిక్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా అడాలజ్‌లో శిక్షణ భవనం, విద్యార్థి భవనాలకు శంకుస్థాపనలు చేస్తారు. మరో కార్యక్రమం ప్రధానమంత్రి శ్రమ యోగీ మాన్ ధన్ యోజనను వస్త్రల్‌లో ప్రారంభిస్తారు. ఈ రెండు కార్యక్రమాలతో యువతకు ఉపాధి, శిక్షణ అవకాశాలు మెరుగుపరచనున్నారు. కాగా మోదీపై తెలుగు రాష్ట్రాల నుండి ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులకు ప్రతిపాదనలు ఉన్నా కూడా వాటిని పట్టించుకోవడం లేదని విమర్శలొస్తున్నాయి.

మొదటి రోజు పర్యటనలో మోదీ అహ్మదాబాద్‌లో మెట్రో సర్వీసుకు శ్రీకారం చుట్టారు. ఉమియాథామ్ దేవాలయ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. దాంతోపాటు గాంధీనగర్‌లోని అన్నపూర్ణ ధామ్ ట్రస్టులో కొన్ని అభివృద్ధి పనులను ప్రారంభించారు. సౌరాష్ట్ర ప్రాంతంలోని జామ్ నగర్‌లో 750 పడకల సామర్ధ్యం గల గురుగోవింద్ సింగ్ ఆసుపత్రి, పీజీ హాస్టల్‌ను ప్రారంభించారు. రంజిత్ సాగర్ ఎత్తిపోతల పథకం, మాచు-1, నైరీ ఎత్తిపోతల పథకం, సౌనీ రక్షితమంచినీటి పథకాల్ని ప్రధాని ప్రారంభించారు. ఉంద్ -3, వేణు -2 లిప్ట్ ఇరిగేషన్ స్కీంలకు శంకుస్థాపన చేశారు. జాంనగర్‌లో రైల్వే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన తర్వాత బాంద్రా-జాంనగర్ హంసఫర్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రధాని పచ్చజెండా ఊపారు. తల్లీ పిల్లల ఆసుపత్రి, కేన్సర్ హాస్పిటల్, కంటి ఆసుపత్రి, దంతవైద్యశాలల్ని మోదీ ప్రారంభించారు.

తరువాత జామ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్న ప్రధాని, తన టార్గెట్ ఉగ్రవాదుల్ని అంతం చేయడమే అన్నారు. కానీ విపక్ష పార్టీలకు మాత్రం తానే టార్గెట్ అని ఆరోపించారు. మోదీని అంతం చేయడమే లక్ష్యంగా విపక్ష పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయని మండిపడిన ఆయన భారత సైన్యం సామర్ధ్యం మీద నమ్మకం లేదా? అని ప్రశ్నించారు.