ఈ వారంలోనే వెలువడనున్న పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్‌

SMTV Desk 2019-03-05 12:29:01  Election Commission, Lok Sabha Polls, Andhrapradesh, Odissa, Arunachal Pradesh, Sikkim, Assembly Elections

న్యూఢిల్లీ, మార్చి 5: దేశవ్యాప్తంగా జరగనున్న పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ ఎన్నికలకు ఈ వారం లోనే షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. లోక్ సభ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను దాదాపుగా ఖరారు చేసింది. ఎన్నికల షెడ్యూల్‌ ఈ నెల 7,8 తేదిల్లో విడుదలవుతుందని సమాచారం.అనుకోని సందర్భంగా వాయిదా పడితే 11,12 తేదిల్లో కచ్చితంగా షెడ్యూల్‌ వెలువడుతుందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. షెడ్యూల్‌ ఈ తేదీల్లో ఎప్పుడు వచ్చినా మొదటి దశ నోటిఫికేషన్‌ ఈ నెల 18న వెలువడుతుందని సమాచారం. దేశవ్యాప్తంగా ఆరు లేదా ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. ఈ ఎన్నికలను మే 21లోగా పూర్తి చేసేందుకు వీలుగా షెడ్యూల్‌ ను రూపొందించనున్నారు.

ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు పూర్తి చేయాలని ఈసీ నిర్ణయించింది. జమ్మూకశ్మీర్‌లో శాసనసభకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా, శాంతిభద్రతల దృష్ట్యా ఇప్పుడే నిర్వహించే అవకాశం లేదని తెలుస్తోంది. అత్యున్నత వర్గాలిచ్చిన సమాచారం ప్రకారం లోక్‌సభ ఎన్నికలకు మొదటి దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 13–17 తేదీల మధ్య ఉండొచ్చు. తరువాతి దశల ఎన్నికలకు మధ్య గడువు 5-7 ఉండే అవకాశం ఉంది. ఈ రెండు దశల మధ్య వారం రోజుల సమయం తీసుకుంటే ఓట్ల లెక్కింపు మే 21–25 తేదీల మధ్య ఉంటుందని, ఐదు రోజుల సమయం తీసుకుంటే మే 15వ తేదీ నాటికి మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని ఈసీ వర్గాలు తెలియజేశాయి. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలతో పాటు తెలంగాణలో మొదటి దశలోనే పోలింగ్‌ నిర్వహించే అవకాశం ఉంది.