బీజేపీలో చేరిన రవీంద్ర జడేజా భార్య

SMTV Desk 2019-03-05 12:12:54  bjp, jadeja, ravindra jadeja

భారత్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా సోలంకి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆమె తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం గుజరాత్ వ్యవసాయశాఖ మంత్రి ఆర్సీ ఫల్దు, ఏంపీ పూనంల సమక్షంలో రివాబా ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.

ప్రధాని నరేంద్రమోదీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనకు స్ఫూర్తి అని, అందుకే తాను బీజేపీలో చేరినట్టు రవీబా జడేజా తెలిపారు. బీజేపీలో చేరడం ద్వారా దేశం మొత్తానికి సేవ చేసే అవకాశం లభిస్తుందన్నారు. గత ఏడాది నవంబర్ 20న జడేజా, ఆయన భార్య ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన విషయం తెలిసిందే.

కర్ణిసేన మహిళా విభాగం అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన 6 నెల్లకే ఆమె రాజకీయాల్లోకి రావడం చర్చనీయాంశమైంది. గతేడాది ‘పద్మావత్’ సినిమాకి వ్యతిరేకంగా గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాల్లో కర్ణిసేన ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే.

క్షత్రియ వంశ చరిత్రను వక్రీకరించే విధంగా సినిమాను రూపొందిచినట్లు పేర్కొంటూ వారు ఈ నిరసన చేపట్టారు. దీంతో కొన్ని రాష్ట్రాలు మొదట్లో ఈ సినిమాను ప్రదర్శించడానికి వెనుకాడాయి. ఈ నిరసనల సమయంలోనే కర్ణిసేన పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. అదే సమయంలో ఓ కానిస్టేబుల్‌ గొడవతో తొలిసారి వార్తల్లో నిలిచిన రివాబా.. ప్రస్తుతం రాజ్‌కోట్‌లో ఉంటూ జడేజా రెస్టారెంట్‌ నిర్వహిస్తున్నారు. కాగా ఇప్పుడు బీజేపీలో అడుగుపెట్టారు.