రికార్డుల మోత మ్రోగించిన కుంభమేళా

SMTV Desk 2019-03-05 11:49:32  kumbhamela,.

న్యూ ఢిల్లీ, మార్చ్ 04: 2019, జవవరి 14న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైన కుంభమేళా మూడు గిన్నిస్ రికార్డులను కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ రోజుతో కుంభమేళా ముగియనున్న సందర్భంలో మూడు గిన్నిస్ రికార్డులు రావడంపై యూపీ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. 45 రోజుల పాటు సాగిన ఈ కుంభమేళాకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. ఉత్సవాల్లో పారిశుద్ధ్య కార్మికుల పాత్రపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. స్వయంగా పీఎం మోదీయే పారిశుద్ధ్య కార్మికుల పాదాలను కడిగి వారి కృషిని ప్రశంసించారు.

ఇక గిన్నిస్ రికార్డుల విషయానికి వస్తే.. ఆ మూడింటిలో మొదటిది 10వేల మంది పారిశుద్ధ్య కార్మికులు నాలుగు రోజుల పాటు పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా వుంచారు. రెండవది మార్చి 1న జరిగిన పెయింటింగ్‌ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో కళాకారులు పాల్గొని మరో గిన్నిస్ రికార్డు సాధించారు. మూడవ రికార్డేమో ఫిబ్రవరి 28న 503 షటిల్‌ బస్సులలో యాత్రికులు కుంభమేళాకు చేరుకోవడం.

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుకు చెందిన ముగ్గురు సభ్యుల బృందం ప్రయాగ్‌రాజ్‌కు వచ్చి కార్యక్రమాలను పరిశీలించి ధ్రువీకరించారని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇప్పటివరకు 22 కోట్ల మంది త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించినట్లు అధికారుల అంచనా వేశారు. చివరిరోజైన మహాశివరాత్రి పర్వదినాన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.