భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు, వాయిదా పడిన వివాహం

SMTV Desk 2019-03-05 11:43:05  Marriage, Mahendra Singh, Chagan Karvar, Bharath, Pakistan, Postponed

జైపూర్, మార్చి 4: పుల్వామా ఉగ్రదాడి తరువాత భారత్-పాక్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ వరుస ఘటనల తరువాత సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు భయ భ్రాంతులకు గురవుతున్నారు. ఈ కారణంగా ఓ జంట పెళ్లి కూడా ఆగిపోయింది. రాజస్తాన్‌లోని బర్మార్‌ జిల్లాకు చెందిన మహేంద్ర సింగ్‌కు, పాకిస్తాన్‌, సింధ్‌ ప్రావిన్స్‌లోని అమర్‌ కోట్‌ జిల్లాకు చెందిన చగన్‌ కర్వార్‌కు పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 8న ఆ జంటకు పెళ్లి జరగాల్సి ఉంది. కానీ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ జరిపిన ఆత్మహుతి దాడిలో 40 మంది భారత సీఆర్పీఎఫ్‌ జవాన్లు వీరమరణం పొందడంతో ఇరుదేశాల మధ్య యుద్దవాతావరణం నెలకొంది. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు పెళ్లిని వాయిదా వేసుకున్నారు. పరిస్థితులు చక్కబడిన తర్వాతనే వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నారు.

"గత నెలనే మా పెళ్లి నిశ్చయించారు. పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. వివాహ ఆహ్వాన పత్రికలు కూడా పంచాం. పాకిస్తాన్‌ నుంచి వీసాలు కూడా తీసుకున్నాం. అక్కడికి వెళ్లడానికి థార్‌ ఎక్స్‌ప్రెస్‌ టికెట్లు కూడా బుక్‌ చేశాం. కానీ ఇప్పుడు మా పెళ్లిని వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చాం. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గిన తర్వాతే పెళ్లి చేసుకుంటాం" అని వరుడు మహేంద్ర మీడియాకు తెలిపారు. ఇక సరిహద్దుల్లో సీమాంతర వివాహలు సహజం. రాజ్‌పుత్‌, మెగవాల్‌, బీల్‌, సింధి, కాత్రి కమ్యూనిటీలు ఈ తరహా పెళ్లిలు చేసుకుంటాయి.