కాంగ్రెస్ కు ఎదురుబెబ్బ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఉమేశ్‌ జాధవ్‌

SMTV Desk 2019-03-05 11:35:46  Umesh Jadav, Parameshwar, Narendra Modi, JDS, Congress, BJP

బెంగుళూరు, మార్చి 4: పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కర్ణాటకలో రాజకీయ పరిస్థితులు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఎదురుబెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉమేశ్‌ జాధవ్‌ సోమవారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అలాగే పార్టీ స్వభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. రాజీనామా లేఖను స్పీకర్‌కు సమర్పించారు. చించోలి నుండి ఎమ్మెల్యేగా సాదించిన ఆయన త్వరలోనే బీజేపీలో చేరే వ్యూహాలు పన్నుతున్నట్లు సమాచారం. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో జాదవ్‌కు కలబురిగి నియోజకవర్గం టికెట్‌ను బీజేపీ ఇవ్వనుందని, బుధవారం ప్రధాని మోదీ కలబురిగి పర్యటన సందర్భంగా ఈ మేరకు లాంఛనంగా పార్టీలో చేరనున్నారని స్థానికంగా కథనాలు వస్తున్నాయి.

ప్రస్తుతం కర్ణాటకలో అధికార పార్టీ జేడీఎస్‌తో మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీకి తీవ్ర విభేదాలు ఉన్నాయని తెలుస్తోంది. తమ ఎమ్మెల్యేలను వారివైపు తిప్పుకొనేందుకు బీజేపీ ప్రలోభాల పర్వాన్ని ముమ్మరం చేసిందని కాంగ్రెస్‌, జేడీఎస్‌ పార్టీలు ఆరోపిస్తున్నాయి. అంతేకాకుండా తాను దళితుడు కావడం వల్ల తనకు మూడుసార్లు సీఎం పదవి నిరాకరించారని, తాను ఉప ముఖ్యమంత్రి పదవిని అసంతృప్తితోనే నిర్వహిస్తున్నానని కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్‌ జీ పరమేశ్వర చేసిన వ్యాఖ్యలు హస్తం పార్టీని కుదిపేస్తున్నాయి.