ఈరోజే ముగియనున్న కుంభమేళా

SMTV Desk 2019-03-04 19:55:38  Kumbha Mela, Shiva Ratri, Devotion, Holy Bathing

లక్నో, మార్చి 4: ఈ ఏడాది జనవరి 15న ప్రారంభమైన ఉత్తరప్రదేశ్‌లో కుంభ మేళాకు ఇవాళే చివరి రోజు. గంగా, యమున, సరస్వతి పవిత్ర సంగమంలో స్నానం చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు, యాత్రికులూ, సాధువులూ ప్రయాగ రాజ్ చేరుకుంటున్నారు. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కుంభమేళాలో భారీగా భక్తులు తరలి రానున్నారు. ఇందుకు భారీ భద్రత సిబ్బందిని ఏర్పాటు చేశారు. నేటితో ముగియనున్న ఈ కుంభమేళాం, మహాశివరాత్రి కావడంతో దాదాపు 400 మంది కేంద్ర పారా మిలటరీ సిబ్బందిని మోహరించారు. కుంభమేళాలో ఈ ఒక్కరోజు 60 లక్షల నుంచి కోటి మంది భక్తులు పుణ్యస్నానం ఆచరిస్తారని అధికారులు పేర్కొన్నారు.

భారీస్ధాయిలో తరలి వచ్చే భక్తుల కోసం పటిష్ట ఏర్పాట్లు చేశామని జిల్లా మేజిస్ర్టేట్‌ విజయ్‌ కిరణ్‌ ఆనంద్‌ వెల్లడించారు. పొరుగు జిల్లాలైన కౌశంబి, ప్రతాప్‌గఢ్‌, ఫతేపూర్‌ జిల్లాల నుండి అదనపు పోలీసు బలగాలను రప్పించామని చెప్పారు. ప్రయాగరాజ్‌లో కుంభమేళా ప్రతి ఆరేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. ప్రతి 12 ఏళ్లకు మహాకుంభమేళాను యాత్రికులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ ఏడాది ఇప్పటివరకూ 22 కోట్ల మంది హిందువులు కుంభ మేళాలో స్నానం చేసినట్లు అధికారులు తెలిపారు.