నెల్లూరు జిల్లాలో పవన్‌కళ్యాణ్‌ ..

SMTV Desk 2019-03-04 19:16:23  Pawan Kalyan, Nellore, Roadshow

నెల్లూరు, మార్చి 4: నేడు జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో రెండు రోజుల పాటు రోడ్‌షో నిర్వహించనున్నట్లు సమాచారం. పార్టీ వర్గాల సమాచారాన్ని బట్టీ నెల్లూరు జిల్లాలో సోమవారం ఉదయం 8 గంటలకు అల్పాహారం తర్వాత పవన్ కల్యాణ్ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. తరువాత జిల్లాకు చెందిన వీఐపీలు, ఇతర ముఖ్య నాయకులతో మాట్లాడనున్నారు. అనంతరం జిల్లాలోని అన్ని నియోజక వర్గాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలతో భేటి కానున్నారు. తర్వాత విద్యార్థులు, మేథావులతో ముఖాముఖి కార్యక్రమం లో పాల్గొననున్నారు.

మధ్నాహ్నం భోజన విరామం తర్వాత 2.30 గంటలకు పవన్ కల్యాణ్ రోడ్‌షో ప్రారంభించనున్నారు. మొదటగా ఆనం వెంకటరెడ్డి విగ్రహం దగ్గరకు వెళ్లి అక్కడ నుంచీ శ్రీపొట్టి శ్రీరాములు విగ్రహం, బోసు బొమ్మ, కనకమహల్‌ సెంటర్ల మీదుగా గాంధీ బొమ్మ దగ్గరకు చేరకుంటారు. అక్కడ నగర నియోజకవర్గానికి సంబంధించిన బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత వీఆర్‌సీ సెంటర్‌, మద్రాసు బస్టాండు, ఆర్టీసీ బస్టాండు మీదుగా ఫత్తేఖాన్‌పేట రైతుబజార్‌కు చేరుకుంటారు. అక్కడ రూరల్‌ నియోజకవర్గానికి సంబంధించిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తరువాత ధనలక్ష్మీపురంలోని కేజీకే కళ్యాణమండపం చేరుకుంటారు. సోమవారం రాత్రి అక్కడే బస చేసి తిరిగి మంగళవారం ఉదయం 7 గంటలకు బయలుదేరి కోవూరు, కావలిలో జరిగే రోడ్‌షోలో పాల్గొని రోడ్డుమార్గాన ప్రకాశం జిల్లాకు వెళతారని పార్టీ వర్గాలు వివరించాయి.