పారాచూట్‌ ద్వారా బయటకొచ్చే క్రమంలో ఇలా జరిగింది

SMTV Desk 2019-03-04 19:11:21  Abhinandan, Back Injured, Parachute, Cooling Down

న్యూఢిల్లీ, మార్చి 4: భారత వాయుసేన(ఐఏఎఫ్‌) వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ పాకిస్తాన్‌ చెర నుండి ఇటివలే విడుదలైన సంగతి తెలిసిందే. భారత భూభాగంలోకి ప్రవేశించిన పాక్‌ ఎఫ్‌–16 యుద్ధ విమానాన్ని తన మిగ్‌–21 ద్వారా అభినందన్‌ కూల్చి వేయగా, ఈ క్రమంలో తన విమానం కూడా దెబ్బతినడంతో పారాచూట్‌తో అభినందన్‌ ఎజెక్ట్‌ అయ్యారు.

ఇప్పుడు అభినందన్‌ కు అన్ని విధాలా వైద్య పరిక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అతని వెన్నెముక కింది భాగంలో గాయమైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే పాకిస్తాన్‌లో అల్లరిమూకలు చేసిన దాడిలో అభినందన్‌ పక్కటెముక ఒకటి దెబ్బతిందని వెల్లడించాయి. ఎంఆర్‌ఐ స్కాన్‌లో ఆయన శరీరంలో ఎలాంటి బగ్స్‌(సూక్ష్మ నిఘా పరికరాలు) లేనట్లు తేలిందని పేర్కొన్నాయి.

ప్రస్తుతం ఢిల్లీ కంటోన్మెంట్‌లోని రీసెర్చ్‌ అండ్‌ రెఫరల్‌ ఆసుపత్రిలో అభినందన్‌కు చికిత్స కొనసాగుతోంది. విమానం నుండి పారాచూట్‌ ద్వారా బయటకొచ్చే క్రమంలోనే ఆయన వెన్నెముకకు గాయమై ఉంటుందని భావిస్తున్నారు. కాగా, అభినందన్‌ ఆరోగ్యస్థితిని అంచనా వేసే కూలింగ్‌ డౌన్‌ ప్రక్రియలో భాగంగా మరిన్ని పరీక్షలు చేయనున్నారు.