జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్ బతికే ఉన్నాడా?

SMTV Desk 2019-03-04 19:03:08  jaish, jai-she mohammed, masood ajhar, pakistan foreign minister

ఇస్లామాబాద్, మార్చి 04: జైషే మహ్మద్ టెర్రర్ గ్రూపు అధినేత మౌలానా మసూద్ అజహర్ మృతి చెందినట్టు ఇప్పటికే విపరీతంగా ప్రచారం జరుగుతోంది. అయితే మసూద్ అజహర్ బతికే ఉన్నాడని, ఆయన చనిపోయినట్టు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజంలేదని జైషే మహ్మద్ వర్గాలు తెలిపాయి.

మసూద్ అజహర్ ఆరోగ్యంగా ఉన్నాడని ఓ ప్రకటనలో వెల్లడించాయి. మసూద్ అజహర్ రెండు కిడ్నీలు చెడిపోవడంతో రావల్పిండి ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు కొన్నిరోజుల క్రితమే పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి చెప్పారు. తద్వారా జైషే అధినేత తమ దేశంలోనే ఉన్నాడని పరోక్షంగా అంగీకరించారు.

అయితే, మసూద్ అజహర్ లివర్ క్యాన్సర్ కారణంగా మృతిచెందాడని కొన్ని కథనాలు తెరపైకి రాగా, భారత్ జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్-2లో ప్రాణాలు కోల్పోయాడని మరికొన్ని కథనాలు వచ్చాయి.

వీటన్నిటి నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందేందుకు పాకిస్థానే మసూద్ అజహర్ చనిపోయాడంటూ ప్రచారం చేస్తోందన్న వాదనలు బయల్దేరాయి. అయితే, భారత్ సర్జికల్ స్ట్రయిక్స్-2 నిర్వహించినప్పటి నుంచి ఇప్పటివరకు మసూద్ అజహర్ ఆచూకీ తెలియకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది!