బీసీసీఐ లేఖ‌కు స్పందించిన ఐసీసీ.

SMTV Desk 2019-03-04 19:01:33  icc, paksitan

పుల్వామాలో భార‌త జ‌వాన్ల‌పై పాక్ ఉగ్ర‌వాదులు జ‌రిపిన దాడిలో 40 మందికి పైగా జ‌వాన్లు మృతి చెందిన విష‌యం విదిత‌మే. కాగా ఆ దాడికి భార‌త్ ప్ర‌తీకారం కూడా తీర్చుకుంది. భార‌త వైమానిక ద‌ళం పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి ఉగ్ర‌వాదుల శిబిరాల‌పై దాడి చేసి వంద‌ల కొద్దీ ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చింది. ఈ క్ర‌మంలో పాకిస్థాన్‌ను అన్ని విధాలుగా దెబ్బ తీయాల‌ని భార‌త్ ఆలోచిస్తోంది. అందులో భాగంగానే ఆ దేశంలో ఇకపై ఐసీసీ టోర్న‌మెంట్‌ల‌లోనూ క్రికెట్ ఆడ‌కూడ‌ద‌ని అభిమానులు డిమాండ్ చేయ‌గా, ఆ మేర‌కు బీసీసీఐ ఆలోచించి.. ఐసీసీకి ఓ లేఖ రాసింది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ టోర్న‌మెంట్ నుంచి పాకిస్థాన్‌ను బ‌హిష్క‌రించాల‌ని బీసీసీఐ గ‌త కొద్ది రోజుల కింద‌ట ఐసీసీకి లేఖ రాసింది. ఈ క్ర‌మంలో ఆ లేఖ‌పై ఐసీసీ స్పందించింది.

బీసీసీఐ రాసిన లేఖ‌ను ప‌రిశీలించిన ఐసీసీ స్పందిస్తూ.. వన్డే ప్ర‌పంచ క‌ప్ నుంచి పాకిస్థాన్‌ను త‌ప్పించ‌లేమని తెలియ‌జేసింది. ఉగ్రవాద దేశాల‌ను బ‌హిష్క‌రించాల‌న్న భారత్ డిమాండ్‌కు పెద్ద‌గా ఎవ‌రూ స్పందించ‌లేదు. అయితే క్రికెట్ మ్యాచ్‌ల సంద‌ర్భంగా ఆట‌గాళ్ల భ‌ద్ర‌త ముఖ్య‌మేన‌ని ఆ అంశంపై అన్ని దేశాలు దృష్టి సారించాల‌ని మాత్రం ఐసీసీ తెలిపింది. ఈ క్ర‌మంలో పాక్‌ను నిషేధించ‌డం కుద‌ర‌ని ప‌న‌ని ఐసీసీ చెప్పింది.

కాగా వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్ ప్ర‌కారం.. జూన్ 16వ తేదీన భార‌త్ పాకిస్థాన్‌ను ఢీకొట్ట‌నుంది. అయితే ఈ మ్యాచ్ ఆడాలా, వ‌ద్దా అనే విష‌యంలో ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. అయితే గ‌తంలో ఈ విష‌యంపై ఆట‌గాళ్లు స్పందిస్తూ.. బీసీసీఐ ఎలా చెబితే అలా చేస్తామని, మ్యాచ్ వ‌ద్దంటే ఆడబోమ‌ని ఆట‌గాళ్లు స్ప‌ష్టం చేశారు. దీంతో బీసీసీఐ ఆ వ్య‌వ‌హారాన్ని కేంద్రంపై నెట్టేసింది. కేంద్ర ప్ర‌భుత్వం ఎలా చెబితే అలా న‌డుచుకుంటామ‌ని, పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడ‌వ‌ద్దంటే.. ఆడ‌బోమ‌ని బీసీసీఐ తెలిపింది. దీంతో ఇప్పుడు కేంద్రం తీసుకునే నిర్ణ‌యంపై అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే మ్యాచ్ జూన్‌లో గ‌న‌క అప్ప‌టి వ‌ర‌కు కేంద్రంలో కొత్త ప్ర‌భుత్వం వ‌స్తుంది. దీంతో కొత్త ప్ర‌భుత్వం ఈ విష‌యంపై స్ప‌ష్ట‌త ఇస్తుంద‌ని మాత్రం మ‌న‌కు తెలుస్తుంది. మ‌రి కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చే ప్ర‌భుత్వం భార‌త్‌తో పాక్ మ్యాచ్‌కు ఒప్పుకుంటుందా, లేదా అన్న‌ది మ‌రికొద్ది నెల‌లు వేచి చూస్తే తెలుస్తుంది..!