డేటావార్ : తెలంగాణ పోలీసులు VS ఏపీ పోలీసులు

SMTV Desk 2019-03-04 16:34:39  ysrcp, vijayasaireddy, tdp, chandrababu, it grid company, telangana police, andhrapradesh police

అమరావతి, మార్చ్ 3: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పోలీసుల మధ్య డేటావార్ విషయంపై వివాదం చెలరేగింది. ఏపీకి చెందిన లబ్దిదారుల డేటా చోరీకి గురైందని వైసీపీ జనరల్ సెక్రటరీ విజయసాయిరెడ్డి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు సోదాలు నిర్వహించారు. అలాగే కూకట్‌పల్లికి చెందిన లోకేశ్వర్‌ రెడ్డి అనే వ్యక్తి కూడ ఏపీ లబ్దిదారుల డేటా విషయమై ఫిర్యాదు చేశారు. ఆదివారం నాడు లోకేశ్వర్ రెడ్డి ఇంటికి ఏపీ పోలీసులు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే లోకేశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్లేందుకు వచ్చిన ఏపీ పోలీసులను తెలంగాణ పోలీసులు సహకరించలేదు. ఇకపోతే ఐటీ గ్రిడ్‌కు సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులు కన్పించడం లేదంటూ ఆ సంస్థకు చెందిన ఆశోక్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఐటీ గ్రిడ్ కంపెనీ పలు సంస్థలకు యాప్‌లను తయారు చేస్తోంది. ఏపీలోని టీడీపీ సేవా మిత్రను కూడ ఇదే సంస్థ తయారు చేసింది. అయితే ఈ సంస్థ వద్ద ఏపీకి చెందిన లబ్దిదారుల జాబితా ఉందనే విషయమై వైసీపీ జనరల్ సెక్రటరీ విజయసాయిరెడ్డి వారం రోజుల క్రితం సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే రకమైన ఫిర్యాదును రెండు రోజుల క్రితం లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు ఐటీ గ్రిడ్ విషయమై సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆదివారం నాడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇవాళ సాయంత్రం ఈ విషయమై సైబరాబాద్ పోలీసులు స్పష్టత ఇచ్చే అవకాశం ఉందన్నారు. తమ పార్టీకి చెందిన డేటాను వైసీపీకి అప్పగించేందుకు కుట్ర జరుగుతోందని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. టీడీపీ వ్యవస్థలను నాశనం చేసేందుకు వైసీపీకి టీఆర్ఎస్‌ సర్కార్ ప్రయత్నాలు చేస్తోందని టీడీపీ ఆరోపణలు చేస్తోంది.