తెరాస-టిడిపిల మద్య మరో వివాదం

SMTV Desk 2019-03-04 16:25:14  trs, tdp,

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత తెరాస-టిడిపిల మద్య యుద్ధవాతావరణం నెలకొంది. రెండూ అధికార పార్టీలు కావడంతో వాటి మద్య ఏర్పడిన రాజకీయ విభేదాలు ఇరు ప్రభుత్వాల మద్య ఘర్షణలుగా మారుతున్నాయి. తాజాగా శనివారం అర్దరాత్రి ఇరుప్రభుత్వాల మద్య మరో సరికొత్త వివాదం మొదలైంది.

వైకాపాకు చెందిన లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి పిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు శనివారం అర్దరాత్రి హైదరాబాద్‌ అయ్యప్ప సొసైటీలో బ్లూ ఫ్రాగ్‌ ఐ‌టి గ్రిడ్ మొబైల్‌ టెక్నాలజీ అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీని తెరిపించి సోదాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ సంక్షేమ పధకాల లబ్ధిదారుల వివరాలను ఆ సంస్థ దొంగిలించిందని ఫిర్యాదు రావడంతో ఆ కంపెనీలో సోదాలు నిర్వహించామని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. ఆ కంపెనీలో పనిచేస్తున్న భాస్కర్ అనే ఉద్యోగిని అదుపులో తీసుకొన్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ విషయం తెలుసుకొన్న ఏపీలోని టిడిపి నేతలు ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కూడా వెంటనే అక్కడకు చేరుకొని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్న భాస్కర్ ను తక్షణం విడిచిపెట్టాలని ఏపీ పోలీసులు కోరారు.

బ్లూ ఫ్రాగ్‌ ఐ‌టి గ్రిడ్ మొబైల్‌ టెక్నాలజీ సంస్థ యజమాని టిడిపి మద్దతుదారు. కనుక టిడిపి కార్యకర్తలను అనుసంధానం చేసే ‘సేవా మిత్రా’ అనే ఓ మొబైల్ యాప్ నిర్వహణ బాధ్యతను టిడిపి ఆ సంస్థకు అప్పగించింది. దానిలో భాగంగా ఏపీ ప్రభుత్వం అమలుచేస్తున్న పలు సంక్షేమపధకాలు, వాటి లబ్ధిదారుల వివరాలు, ఓటర్ల జాబితాలు వంటి కీలకమైన డాటా ఆ సంస్థ చేతిలోకి వెళ్లిపోయిందని, రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉండవలసిన ఆ రహస్య సమాచారం ఒక ప్రైవేట్ కంపెనీ చేతికి ఎలా వెళ్ళిందని లోకేశ్వర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.

అయితే దీనిపై ఏపీ సిఎం చంద్రబాబునాయుడు చాలా తీవ్రంగా స్పందించారు. అనేక దశాబ్ధాలుగా హైదరాబాద్‌లో స్థిరపడి కంపెనీలు పెట్టుకొన్నవారిపై అర్దరాత్రి ఈవిధంగా దాడులు చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. తెరాస, వైకాపాలు కుట్రపన్ని టిడిపికి సంబందించిన సమాచారాన్ని ఈవిధంగా సేకరించి, ఎన్నికలలో టిడిపిని దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. హైదరాబాద్‌లో టిడిపి మద్దతుదారులైన పారిశ్రామికవేత్తలను, ఐ‌టి యాజమానులను ఎన్నికలలో వైకాపాకు, జగన్‌మోహన్‌రెడ్డికు మద్దతు ఇవ్వాలని సిఎం కేసీఆర్‌ తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని లేకుంటే ఈవిధంగా పోలీసుల చేత దాడులు చేయిస్తూ భయబ్రాంతులను చేస్తున్నారని ఆరోపించారు. తమ జోలికి వస్తే ఊరుకోబోమని చంద్రబాబునాయుడు సిఎం కేసీఆర్‌ను తీవ్రంగా హెచ్చరించారు.