సంచలనం రేపిన శ్రీజ్యోతి హత్య కేసు నిందితుడు అరెస్ట్

SMTV Desk 2019-03-02 16:07:37  Srijyothi murder case, Guntoor, Accused srinivasrao

గుంటూరు, మార్చ్ 2: గుంటూరు జిల్లాలో ఈ మధ్య సంచలనం రేపిన శ్రీజ్యోతి హత్య కేసులో పోలీసులు ఎట్టకేలకు నిందితుడుని అరెస్ట్ చేశారు. నిందితుడు శ్రీనివాసరావుని తాజాగా అరెస్ట్ చేసి అతని ద్వారా పలు కీలక ఆధారాలను రాబట్టారు. పోలీసుల కథనం ప్రకారం... గుంటూరు జిల్లా తెనాలి ఇస్లాంపేటలోని హిందూ ముస్లిం రోడ్డులో జ్యోతి(20) కుటుంబసభ్యులతో నివసిస్తోంది. కాగా జ్యోతి తండ్రికి నిందితుడు శ్రీనివాసరావు మిత్రుడు. కొంతకాలం క్రితం భార్యతో విడిపోయి ఒంటరిగా నివసిస్తున్నాడు. కాగా.. అతని కన్ను జ్యోతిపై పడింది. ఎలాగైనా జ్యోతిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఇదే విషయమై.. జ్యోతి తల్లిదండ్రులను కూడా సంప్రదించాడు. వాళ్లు అంగీకరించలేదు. ఈ క్రమంలో జ్యోతి తల్లిదండ్రులకు ఆమెకు మరో వివాహం నిశ్చయం చేశారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు.. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసుకొని శ్రీజ్యోతి ఇంటికి వెళ్లి.. ఒంటరిగా ఉన్న ఆమెపై చాకుతో దాడి చేశాడు. గొంతులో పలుమార్లు పొడిచి హత్య చేశాడు. కాగా, నిందితుడు వేద టాకీస్‌ పక్క సందులోని అతని మామయ్య ఇంట్లో ఉండగా గురువారం అదుపులోకి తీసుకున్నట్టు సీఐ తెలిపారు. సత్యనారాయణను కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు.