ఆలయం అభివృద్దికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు: కుమారస్వామి

SMTV Desk 2019-03-02 15:19:00  Kumaraswamy, Sree Tripura Sundari Devi, Temple, Development, Muguru

బెంగళూరు, మార్చి 2: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి మైసూరు జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని టీ. నరశీపురలోని మూగూరులో వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అలాగే మూగురులోని శ్రీ త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయాని వెళ్లి దేవిని దర్శించుకున్నాడు. ఈసందర్బంగా కుమారస్వామి మాట్లాడుతూ, శ్రీ త్రిపుర సుందరి దేవి అమ్మవారికి ప్రత్యకపూజలు చేసి ఆశీర్వాదం తీసుకోవడం వలనే తాను ముఖ్యమంత్రి అయ్యానని అన్నారు. భక్తిశ్రద్దలతో అమ్మవారిని పూజించడం, అమ్మ అశీర్వదించడం వలనే నేడు ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందన్నారు. తాను 2018 శాసన సభ ఎన్నిక ప్రచార సమయంలో శ్రీ త్రిపుర సుందరి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశానని గుర్తు చేశారు.

అలాగే, తాను ముఖ్యమంత్రి అయిన తరువాత మూగూరు ఆలయంలో అడుగుపెట్టి ప్రత్యేక పూజలు చేస్తానని ఆరోజు అమ్మవారికి మొక్కు చేసుకున్నానని సీఎం అన్నారు. అనుకున్నట్లు అమ్మవారు ఆశీర్వదించడం, తాను ముఖ్యమంత్రి కావడం జరిగిందన్నారు. తాను ముఖ్యమంత్రి కావడానికి కారణం అయిన అమ్మ దేవాలయం అభివృద్దికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదని, ఈ ఆలయం అభివృద్ది చెయ్యడానికి తాను సిద్దంగా ఉన్నానని ఆయన అన్నారు. ఈ ఆలయం అభివృద్ది చెందితే వర్షాలు పడి పంటపోలాలు పచ్చగా ఉంటాయని, రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటారన్నారు. సంకీర్ణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది పనుల గురించి ఇంటింటికి తిరిగి ప్రచారం చెయ్యాలని, రైతులు ఇక ముందు ఆత్మహత్య చేసుకునేందుకు తాము అవకాశం ఇవ్వమని, త్వరలో అన్ని సమస్యలు సర్దుకుంటాయని, అందరీకి శ్రీ త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆశీర్వాదం ఉంటుందన్నారు.