యువతకు ఆదర్శంగా నిలిచిన పెళ్లి పత్రిక...!

SMTV Desk 2019-03-02 14:03:57  Bihar, Wedding Card

పాట్నా, మార్చి 02: ఎన్నికల సమయంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ఎంతో అవసరం. సరైన నాయకులను ఎన్నుకోవడం కోసం ప్రజలు ఓటు హక్కును వినియోగించాల్సి ఉంటుంది. కానీ కొందరు వ్యక్తులు ఓటు హక్కు వినియోగిచడానికి ఆసక్తి చూపించరు. దీంతో అర్హత లేనివారు, అవినీతిపరులు అధికారంలోకి వస్తారు. ఆలా జరుగకుండా ఉండడానికి ఓ పోలీస్ అధికారి వినూత్న ప్రయత్నం చేశారు.

బీహార్ లోని తూర్పు చంపారన్‌ మోతీహరిలో పనిచేస్తున్న రామ్‌లాల్‌ ప్రసాద్‌కు సామాజిక స్పృహ ఎక్కువ. ఈ నెల 6న ఆయన వివాహం జరగనుంది. ఈ సందర్భంగా తన వివాహ పత్రికలో ముహూర్తం, కల్యాణ మండపం వివరాలతో పాటు ఓటు హక్కు, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను కూడా తెలియజెప్పారు. "యవత జీవితంలో ముఖ్యమైన విషయాలు మూడు. అవి చదువు, పని, ఓటు. ఈ మూడింటిలో ఓటు చాలా ముఖ్యం" అని పెళ్లికార్డుపై ముద్రించారు. చెట్లంటే అతనికి అమితమైన ఇష్టం కావడంతో స్థానికులంతా అతన్ని ట్రీ మ్యాన్‌ అని కూడా పిలుస్తుంటారు.