ఇంటర్ పరీక్ష: ఇలా కూడా చెయ్యొచ్చా?

SMTV Desk 2019-03-02 12:14:58  Intermediate exams, hyderabad

హైదరాబాద్, మార్చి 02: తెలంగాణాలో ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. ఈ పరీక్షల్లో కాలేజీ యాజమాన్యం కళ్లుగప్పి ఓ విద్యార్థి చేసిన మోసం బయటపడింది. డబ్బుల కోసం ఓ ఇంటర్‌ విద్యార్థి బదులుగా పరీక్ష రాస్తున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

శుక్రవారం సైదాబాద్ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... యాకుత్‌పురాకు చెందిన సయ్యద్‌ నయీం ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతూ అదే ప్రాంతంలోని స్టూడెంట్‌ పాయింట్‌ కోచింగ్‌ సెంటర్‌లో ట్యూషన్‌కు వెళ్లేవాడు.

కోచింగ్‌ సెంటర్‌లో క్యాషియర్‌గా పని చేస్తున్న ఖాలేద్‌ రెయిన్‌ బజార్‌కు చెందిన తన స్నేహితుడు మహ్మద్‌ సోహేల్‌‌ను నయీంకు పరిచయం చేశాడు. సోహేల్‌కు బదులుగా నయీం పరీక్ష రాసేందుకు గాను ఇద్దరి మధ్య రూ. 2 వేలకు ఒప్పందం కుదిర్చాడు.

దీంతో శుక్రవారం ఐఎస్‌ సదన్‌లోని గోకుల్‌ కాలేజీ పరీక్షా కేంద్రంలో సోహెల్‌ బదులుగా నయీం ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్‌ పరీక్ష రాస్తుండగా.. నయీం వ్యవహారశైలిపై అనుమానం వచ్చిన ఇన్విజిలేటర్‌ హాల్‌ టికెట్‌ పరిశీలించగా, అందులో మరో విద్యార్థి ఫొటో ఉండటంతో స్క్వాడ్‌కు సమాచారం అందించారు. కాలేజీ ప్రిన్సిపాల్‌ ఫిర్యాదు మేరకు నయీంతో పాటు సోహేల్‌ను అరెస్టు చేసిన సైదాబాద్‌ పోలీసులు రిమాండ్‌ తరలించారు.