వాట్సాప్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఇద్దరు అరెస్ట్

SMTV Desk 2019-03-02 12:11:50  Whatsapp, Hyderabad

హైదరాబాద్, మార్చి 02: వాట్సాప్ లో అసత్య వార్తల ప్రచారం జోరుగా సాగుతుండడంతో ఆ సంస్థ నిభంధనలను కట్టుదిట్టం చేసింది. విద్వేష, అభ్యంతరకరమైన సమాచారాన్ని షేర్ చేసుకుంటే గ్రూప్ అడ్మిన్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ నిబంధనలను ఉల్లంఘించినందుకు తాజాగా ఓ వాట్సాప్ గ్రూప్ సభ్యుడు, దానికి అడ్మిన్ గా ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు.

వివరాలలోకి వెళితే... హైదరాబాద్ లోని మల్కాజిగిరిలో మౌలాలి షఫీనగర్‌కు చెందిన సిరాజ్ జొమాటో సంస్థలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. ఇతను లాయల్‌ పార్టనర్స్‌ ఎమలార్డ్‌ అనే వాట్సాప్ గ్రూప్ లో సభ్యుడిగా ఉన్నాడు. ఈ గ్రూపుకు కుషాయిగూడ నాగార్జున్‌నగర్‌కు చెందిన కమ్మంపల్లి వెంకటేశ్ అడ్మిన్ గా వ్యవహరిస్తున్నాడు.

ఈ క్రమంలో గత నెల 26న సిరాజ్ ఓ అభ్యంతరకరమైన ఫొటోను గ్రూపులో పోస్ట్ చేశాడు. అయితే దీన్ని అడ్మిన్ పట్టించుకోలేదు.దీంతో ఇదే వాట్సాప్ గ్రూపులో ఉన్న తిరుమలేశ్వర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. సిరాజ్ పెట్టిన పోస్ట్ విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందని ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సిరాజ్, వెంకటేశ్ ను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు.