ఇతన్ని పట్టించిన వారికి రూ. 7 కోట్లు బహుమతిగా ఇవ్వబడును

SMTV Desk 2019-03-02 11:37:23  Hamza Bin Laden, Osama Bin Laden, Terrorist, America, Saudi Arabia

రియాద్, మార్చి 2: ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థల ఒకప్పటి అగ్ర నాయకుడు ఒసామా బిన్‌ లాడెన్‌ కొడుకు హంజాబిన్ లాడెన్ పై విషయంలో సౌదీఅరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. హంజా బిన్ లాడెన్ పౌరసత్వాన్ని సౌదీఅరేబియా ప్రభుత్వం రద్దు చేసింది. లాడెన్ కుమారుడిని పట్టించినా, ఆచూకీ చెప్పినా మిలియన్ డాలర్లను (దాదాపు రూ. 7 కోట్లు) బహుమతిగా ఇస్తామని అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సౌదీఅరేబియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

యునైటెడ్ స్టేట్స్ డిప్లొమాటిక్ సెక్యూరిటీ అసిస్టెంట్ సెక్రటరీ మైఖైల్ ఇవనాఫ్ హంజాబిన్ ఆచూకీ తెలిపినవారికి బహుమతి ప్రకటించిన వెంటనే ఇటువంటి నిర్ణయం తీసుకోవడంతో ఈ విషయం గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. జీహాద్‌కు కాబోయే రాజు గా ఉగ్రవాదులు తరుచూ చెప్పుకొనే హంజాబిన్ లాడెన్ అల్ ఖైదా నాయకుడిగా కార్యకలాపాలు సాగిస్తున్నారు.

2017 జనవరిలో అంతర్జాతీయ తీవ్రవాదిగా అతనిని అమెరికా ప్రకటించింది. అతని ఆస్తులను కూడా అమెరికా బ్లాక్ చేసింది. ప్రపంచవ్యాప్త జీహాద్ కు ప్రధాన వ్యక్తిగా ఉండే బిన్‌ లాడెన్ కు వారసుడుగా హంజాబిన్ ఉగ్రవాదంలో కీలకంగా మారుతున్నట్లు అమెరికా నిఘా వర్గాల వద్ద సమాచారం ఉండటంతో యూఎస్‌ అతనిపై రివార్డు ప్రకటించింది.

కాగా, సౌదీ అరేబియా సర్కారుకు వ్యతిరేకంగా సౌదీ తెగల కోసం పోరాడుతున్న హంజా పాకిస్తాన్, అప్ఘనిస్తాన్, సిరియా దేశాల్లో సంచరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో అతడి ఆచూకీ చెప్పిన, కచ్చితమైన సమాచారంతో పట్టించినా ఏడు కోట్ల రూపాయలు బహుమతిగా ఇవ్వనున్నట్టు అమెరికా ప్రకటించింది.