కుప్వారాలో భీకరమైన ఎన్‌కౌంటర్‌

SMTV Desk 2019-03-02 10:56:23  Soldiers, Police, Terrorist, Attack, Kupwara

శ్రీనగర్, మార్చి 2:జమ్మూకాశ్మీర్ లో శుక్రవారం సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య భారి కాల్పులు జరిగాయి. కుప్వారా జిల్లాలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు దొంగదెబ్బ తీయడంతో ఓ సీఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌, మరో ఐదుగురు భద్రతా సిబ్బంది మరణించారు. వెంటనే అప్రమత్తమైన సైనికులు ఇద్దరు ఉగ్రవాదుల్ని హతమార్చారు.

కుప్వారా జిల్లాలోని బాబాగుంద్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘావర్గాల నుండి పోలీసులకు పక్క సమాచారం అందడంతో ఆర్మీ, సీఆర్పీఎఫ్, పోలీసుల సంయుక్త బృందం ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. అంతలోనే బలగాల కదలికల్ని పసిగట్టిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పు లు ప్రారంభించారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఇరువర్గాల మధ్య కాల్పులు చాలాసేపు ఈ దాడి కొనసాగింది. ఉగ్రవాదుల నుండి కాల్పులు ఆగిపోవడంతో భద్రతాబలగాలు వారు నక్కిన ఇంటిలోకి వెళ్లారు. ఓ ఉగ్రవాది చనిపోయినట్లు నటించి వారు రాగానే లేచి తుపాకీతో బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఈ కాల్పుల్లో ఓ సీఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్, జవాన్‌తో పాటు ఇద్దరు ఆర్మీ సిబ్బంది, ఓ పోలీస్‌ అధికారి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

ఈ కాల్పుల్లో గాయపడ్డ మరో నలుగురు చికిత్స పొందుతున్నారు. వసీమ్‌ అహ్మద్‌ అనే స్థానికుడొకరు బుల్లెట్‌ గాయాలతో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్‌ పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ, ఎన్‌కౌంటర్‌ అనంతరం భద్రతాబలగాలపై స్థానిక యువకులు రాళ్లు విసిరారని తెలిపారు. ఈ సందర్భంగా నలుగురు యువకులు గాయపడ్డారని వెల్లడించారు. ఇంకా ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉండొచ్చన్న సమాచారం నేపథ్యంలో కూంబింగ్‌ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.