బండ్ల గణేశ్ కు మళ్లీ నిరాశే

SMTV Desk 2019-03-01 13:38:50  Bandla Ganeh, Pawan Kalyan, Narayana Reddy, Rahul Gandhi, Congress, Janasena, MLA, MLC

హైదరాబాద్, మార్చి 1: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సంచలనం సృష్టించిన సినీ నటుడు, నిర్మాత, కాంగ్రెస్ నేత గణేశ్‌ ఆశలు మళ్లీ ఆవిరయ్యాయి. ముందస్తు ఎన్నికల సమయంలో సినిమల్లోనుండి రాజకీయాల్లోకి అడుగుపెట్టి, ఆయన చేసిన హడావిడి ఇప్పటికీ మర్చిపోలేం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఒకవేళ రాకపోతే తన గొంతు కోసుకుంటానని, అసెంబ్లీలో తాను ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని చెప్పారు. అఖరికి అతనికి టికెట్టు రాకా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక నవ్వులపాలై కనిపించకుండా పోయాడు.

కొన్ని రోజుల తరువాత ప్రత్యక్షమై కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నిప్పేందుకే అలాంటి వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చాడు బండ్ల. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నాడు, కానీ అతనికి పార్టీ టికెట్ దక్కలేదు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయినా తనకు పోటీ చేసే అవకాశం వస్తుందని భావించాడు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాత్రం బండ్ల గణేశ్‌కు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. తను పోటీ చేస్తామని ప్రకటించిన ఒక స్థానానికి గూడురు నారాయణరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో బండ్ల గణేశ్ కు మళ్లీ నిరాశే ఎదురైంది.

బండ్ల గణేశ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అని తెలిసిందే. అయితే బండ్ల జనసేన పార్టీలో చేరతారని అంతా భావించినా, ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు. ఎమ్మెల్యేగానో, ఎమ్మెల్సీగానో పోటీ చేయాలని అనుకున్నాడు. కానీ ఆయన ఆశలు నిరాశాలయ్యాయి.