బీజేపీ పై రాములమ్మ ఫైర్

SMTV Desk 2019-03-01 13:37:02  Vijayashanthi, Pawan Kalyan, Soldier, Eddurappa, BJP, Congress

హైదరాబాద్, మార్చి 1: ప్రపంచవ్యాప్తంగా ఇండియా-పాక్ దాడులు సంచలనం సృష్టిస్తుండగా భారతీయ జనత పార్టీ(బీజేపీ) మాత్రం జవాన్ల ప్రాణ త్యాగాలను కూడా రాజకీయం చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి అన్నారు. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో బీజేపీ జిమ్మిక్కులు చేస్తుందని తాను ఎప్పుడో చెప్పిన విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోమారు చెప్పారని విజయశాంతి అన్నారు. పవన్ వ్యాఖ్యలను పూర్తిగా సమర్థిస్తున్నట్టు చెప్పిన విజయశాంతి, దేశ భద్రతకు సంబంధించిన అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే ప్రయత్నాలు మానుకోవాలని బీజేపీకి హితవు పలికారు. ఈ మేరకు ఆమె తన ఒసిఅల్ మీడియాలో పోస్టు చేశారు.

సరిహద్దులో మన దేహ సైనికులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతుంటే యడ్యూరప్ప వంటి బీజేపీ నేతలు దానిని రాజకీయ స్వలాభం కోసం వాడుకోవాలని చూస్తుండడం హేయమన్నారు. ఇటువంటి వారిని చూసి దేశ ప్రజలు చీ కొడుతున్నారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన బీజేపీ జీఎస్టీ, నోట్లు రద్దు వంటి వాటితో ప్రజలను చాలా ఇబ్బందులు పెట్టిందని ఆరోపించారు. ఎన్నికలో దగ్గర పడడంతో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు దేశ భద్రతను బీజేపీ అడ్డం పెట్టుకుంటుందని మండిపడ్డారు. యడ్యూరప్ప వ్యాఖ్యలకు స్పందించని మోదీ, బీజేపీ బూత్ కార్యకర్తల సమావేశంలో మునిగి తేలడాన్ని బట్టి వారి అజెండా ఏమిటో అర్థం చేసుకోవచ్చని విజయశాంతి పేర్కొన్నారు.