అన్నాడీఎంకే పార్టీకే 'రెండాకుల' చిహ్నం

SMTV Desk 2019-03-01 13:30:42  Anna DMK, Palani Swamy, Panneer Selvam, Shashikala, Jayalalitha, Party Symbol

చెన్నై, మార్చి 1: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే పార్టీ అగ్రనేతల్లో విభేదాలొచ్చి విడిపోయారు. కొద్దిరోజుల క్రితం తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ ఎడపాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం, శశికళ వర్గాలు రెండాకుల చిహ్నం కోసం పోటీపడ్డాయి. చెన్నై ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో మూడు వర్గాలూ రెండాకుల చిహ్నం కోసం కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)ని ఆశ్రయించాయి. అయితే, రెండాకుల చిహ్నం ఎవరికీ చెందకుండా తాత్కాలిక నిషేధం విధించింది. ఎన్నికల తర్వాత మూడు వర్గాలు ఈసీ వద్ద తమ వాదనలకు బలం చేకూరుస్తూ అనేక డాక్యుమెంట్లను సమర్పించాయి. కొన్నిరోజుల తర్వాత ఎడపాడి, పన్నీర్‌ సెల్వం ఏకమైపోగా శశికళ వర్గం ప్రతినిధిగా టీటీవీ దినకరన్‌ పోటీపడ్డారు. విచారణ జరిపాక ఎడపాడి, పన్నీర్‌సెల్వం నేతృత్వంలో అన్నాడీఎంకే పార్టీకే రెండాకుల చిహ్నాన్ని కేటాయిస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. ఈసీ నిర్ణయాన్ని దినకరన్‌ ఢిల్లీ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఈ కేసులో వాదోపవాదాలు ముగియగా రెండాకుల చిహ్నాన్ని ఎడపాడి, పన్నీర్‌ సెల్వం నేతృత్వంలోని అన్నాడీఎంకేకు కేటాయిస్తూ ఢిల్లీ హైకోర్టు గురువారం తీర్పు చెప్పింది.