భారత్-ఆసిస్ వన్డే: పటిష్ఠ భద్రత ఏర్పాటు

SMTV Desk 2019-02-28 18:44:45  India vs Australia ODI, Hyderabad Uppal stadium, Rachakonda CP, Mahesh bhagavath

హైదరాబాద్, ఫిబ్రవరి 28: భారత్ ఆస్ట్రేలియా తో తలపడనున్న రెండు సిరీస్ లలో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్ తో మొదటి సిరీస్ టీ20 ముగిసింది. ఇక మిగిలింది వన్డే సిరీస్. అయితే ఈ సీరీస్ ఆరంభ మ్యాచ్ కు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది.

విశాఖ, బెంగళూరు టీ20లో ఓడించి సీరిస్ ను కైవసం చేసుకున్న ఆసిస్ ను వన్డే సీరిలో ఓడించి పరువు కాపాడుకోవాలని భారత్ భావిస్తోంది. కాగా ఈ మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయంటేనే అభిమానుల్లో దీనిపై ఎంతగా ఆసక్తి నెలకొని వుందో అర్థమవుతుంది.

దీంతో స్టేడియంకు వచ్చే అభిమానులకు రాచకొండ సిపి మహేష్ భగవత్ పలు సూచనలు చేశారు. దాదాపు 38 వేలకు పైచిలుకు అభిమానులు మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఉప్పల్ స్టేడియానికి రానున్నట్లు సిపి తెలిపారు. వీరంతా భద్రతా కారణాల దృష్ట్యా పోలీసుల ఆంక్షలను తప్పకుండా పాటించాల్సి వుంటుందని సూచించారు. ఉళ్లంఘించిన వారిపై కఠిన చర్యలుంటాయని సిపి హెచ్చరించారు.

ముఖ్యంగా ఆటగాళ్ల భద్రతను దృష్టిలో వుంచుకుని స్టేడియంలోకి కొన్ని వస్తువులను తీసుకెళ్లకుండా నిషేధించినట్లు వెల్లడించారు. సిగరెట్టు, అగ్గిపెట్టెలు, బ్యానర్లు, నగదు నాణేలు, పెన్నులు, సెల్ ఫోన్ చార్జర్లు, బ్యాగులతో పాటు వాటర్ బాటిల్స్, తిను బండాలను కూడా స్టేడియంలోకి అనుమతించబోమని వివరించారు.

కేవలం సెల్ ఫోన్ల ను మాత్రమే అనుమతిస్తున్నట్లు సిపి స్పష్టం చేశారు. ఇక వ్యక్తిగత వాహనాల్లో మ్యాచ్ ను వీక్షించచేందుకు స్టేడియం వద్దకు చేరుకునే అభిమానులు నిర్దేశిత ప్రాంతాల్లోనే వాహనాలను పార్క్ చేయాలన్నారు. వెహికిల్ పాస్ వున్న వాహనాలను మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తామని మహేష్ భగవత్ వెల్లడించారు.