ఏ తప్పు జరిగినా రెండు దేశాలు నాశనమైపోతాయి: పాక్ ప్రధాని

SMTV Desk 2019-02-28 18:42:48  kaushal army, president imran khan, suicide bomber

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 28: పాకిస్థాన్-భారత్ ల మధ్య పరిస్థితులు విషమించాలని ఇరు దేశాలు కోరుకోవడం లేదని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పాక్ పార్లమెంటులో ఆయన ప్రసంగిస్తూ.......భారత ప్రజలకు ఒక ప్రశ్నను సంధించారు.

"గత నాలుగేళ్లలో ఏం జరిగింది? కశ్మీర్ లో ఒక ఉద్యమం రూపుదాల్చింది. గతంలో కశ్మీరీ నాయకులు భారత్ నుంచి విడిపోవాలని కోరుకోలేదు. కానీ భారత ప్రభుత్వ క్రూరత్వం వల్ల ఈ రోజు వారంతా స్వాతంత్ర్యం కావాలని కోరుకుంటున్నారు" అని చెప్పారు.

ఒక 19 ఏళ్ల కుర్రాడు మానవబాంబుగా ఎందుకు మారాడో అర్థం చేసుకోవాలని ఇమ్రాన్ అన్నారు. చేసిన పనినే మళ్లీ మళ్లీ చేస్తూ... సరికొత్త ఫలితాన్ని రాబట్టాలనుకోవడమనేది ఐన్ స్టీన్ థియరీ ఆఫ్ మ్యాడ్ నెస్ అని చెప్పారు. కశ్మీర్ లో జరుగుతున్న పరిణామాలకు పాకిస్థాన్ ను ఎంతకాలం నిందిస్తారని ప్రశ్నించారు.

ఆధారాలు చూపకుండానే చర్యలు తీసుకోవాలని ఎలా అడుగుతారని చెప్పారు. ఆత్మాహుతి దాడులను ఇస్లామిక్ రాడికలిజం అని అంటున్నారని... హిందూమతానికి చెందిన తమిళ టైగర్లు ఇదే విధంగా దాడులు చేసేవారని గుర్తు చేశారు.

ఆత్మాహుతి దాడులకు, మతానికి సంబంధం లేదని ఇమ్రాన్ చెప్పారు. బలహీనతలు, నిరాశ వల్ల కొందరు ఇలాంటి దాడులకు తెగబడతారని అన్నారు. ప్రస్తుత భారత ప్రభుత్వం యుద్ధానికి సైతం సిద్ధమవుతున్న తీరును భారత ప్రజలు అంగీకరించడం లేదని చెప్పారు.

గత 17 ఏళ్లుగా పాక్ మీడియా ఏం చేసిందో భారత మీడియా గమనించినట్టైతే... యుద్ధ వాతావరణాన్ని సృష్టించే విధంగా కథనాలను ప్రసారం చేయదని అన్నారు. సమస్యకు యుద్ధం పరిష్కారం కాదని చెప్పారు. ఏ తప్పు జరిగినా రెండు దేశాలు నాశనమైపోతాయని అన్నారు. పరిస్థితి చేయి దాటకుండా చూడాలని సూచించారు. లేనిపక్షంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందని చెప్పారు.