ముఖ్యమంత్రి అడ్డు రావడం మంచిది కాదు....!

SMTV Desk 2019-02-28 18:23:56  Talasani srinivasyadav, Telanagana minister, AP Chief minister chandrababu, TRS, BC Bahiranga sabha

గుంటూరు, ఫిబ్రవరి 28: మార్చి 3న తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ ఏపీ రాష్ట్రంలోని బీసీలందరిని ఒక్కచోటికి చేర్చి గుంటూరులో ఓ బహిరంగ సభ నిర్వహించడానికి సిద్దమయిన సంగతి తెలిసిందే. అయితే ఆ సభకు ఇప్పటివరకు ఎలాంటి అనుమతులు రాకపోవడంపై తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు బీసీ సభపై పోలీస్ శాఖ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో స్థానిక డీఎస్పీని ఫోన్ ద్వారా సంప్రదించినట్లు తలసాని తెలిపారు.

అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సభకు అనుమతించడం లేదని చెప్పారని తలసాని పేర్కొన్నారు. శాంతియుతంగా బీసీల సమస్యలు, రాజకీయ చైతన్యం కోసం చేపట్టిన బహిరంగ సభకు ఇలా ముఖ్యమంత్రి అడ్డుతగలడం మంచిది కాదని తలసాని సూచించారు. గతంలో తెలంగాణలో సభలు పెడితే తాము అనుమతించలేదా? అని చంద్రబాబును తలసాని ప్రశ్నించారు.

ఇండియాలో ఆంధ్ర ప్రదేశ్ భాగం కాదన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని తలసాని మండిపడ్డారు. బీసీ సభకు ప్రభుత్వం అనుమతించకుంటే కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుంటామని తలసాని ప్రకటించారు. ఆ దిశగా కూడా చర్యలు ప్రారంభించినట్లు తలసాని వెల్లడించారు.