ఓటు హక్కును మార్చుకున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్

SMTV Desk 2019-02-28 15:37:29  Pawan Kalyan, Jaganmohan Reddy, Voter ID, YCP, Janasena

హైదరాబాద్, ఫిబ్రవరి 28: ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఓటు హక్కును హైదరాబాద్ నుండి విజయవాడకు మార్చుకున్నారు. ఈ మధ్యే విజయవాడలోని కోగంటి స్ట్రీట్‌లో సొంత భ‌వ‌నాన్ని నిర్మించుకున్నారు. తాజాగా ఆయన విజ‌య‌వాడ న‌గ‌రంలో ఓట‌రు గుర్తింపు కార్డును న‌మోదు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. పవన్ ద‌రఖాస్తును ఆమోదిస్తూ స‌ద‌రు న‌గ‌ర‌పాల‌క సంస్థ ఓట‌రు గుర్తింపు కార్డుని ప‌వ‌న్‌కు జారీ చేసింది.

కాగా, హైద‌రాబాద్‌లో వుండి లెక్చ‌ర్‌లు దంచ‌డం కాదు, ఏపీకి మ‌కాం మార్చి అప్పుడు మాట్లాడు అని ఇటీవల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ కు బ‌హిరంగంగా స‌వాల్ విసిరిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ నిర్ణయం తీసుకున్న ఆయన ఒక్కో స్టెప్ మారుస్తూ ఏపీకి మ‌కాం మార్చారు.

అయితే, ఓట‌రు గుర్తింపు కార్డుని కూడా న‌మోదు చేసుకోవ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. కాగా, ఇప్పుడు అధికారికంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏపీకి చెందిన ఓట‌రుగా న‌మోదు కాబ‌డ్డారు. రాబోయే సాధార‌ణ ఎన్నిక‌ల‌తో పాటు సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనూ ఏపీ పౌరుడిగా త‌న ఓటు హ‌క్కును పవన్ వినియోగించుకోనున్నారు.