భారత్ కి విమానాల రాకపోకలు బంద్ : ఎయిర్ కెనడా

SMTV Desk 2019-02-28 09:58:11  Air Canada, Canada airlines, transportation rejected, Pulwama effect

పుల్వామా దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రశిబిరాలను భారత్ ధ్వంసం చేసిన తర్వాత రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియక సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటుండగా, పాక్ యుద్ధ సన్నాహాల్లో మునిగినట్టు వార్తలు వినవస్తున్నాయి. ఇందులో భాగంగా దేశంలోని విమానాశ్రయాలను మూసివేసిన పాక్, తమ గగనతలాన్ని కూడా మూసివేసింది.

దీంతో చాలా వరకు అంతర్జాతీయ విమానాలు దారి మళ్లాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌కు విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా టొరొంటో నుంచి ఢిల్లీ బయలుదేరిన ఎయిర్ కెనడా విమానం మార్గమధ్యంలోనే తిరిగి కెనడాకు మళ్లింది. వాంకోవర్ నుంచి ఢిల్లీకి రావాల్సిన విమానాన్ని రద్దు చేసింది. ఇది తాత్కాలిక నిర్ణయం మాత్రమేనని, పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి విమాన సర్వీసులు యథాతథంగా కొనసాగుతాయని ఎయిర్ కెనడా స్పష్టం చేసింది.