ఢిల్లీ మెట్రోకి రెడ్ అలర్ట్, అప్రమత్తంగా ఉండాలని సూచనా!

SMTV Desk 2019-02-28 09:54:31  Delhi, Metro, Red Alert, Narendra Modi, Ajith Doval, Information

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఇండియా-పాకిస్తాన్ ల మధ్య ఘర్షణలు భారీ ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ మెట్రో(డీఎంఆర్సీ)కి రెడ్ అలర్ట్ జారీ చేశారు. భద్రతా ఏజెన్సీల సలహా మేరకు ఢిల్లీ మెట్రోకి ఈ అలర్ట్ జారీ చేశారు. అలాగే, స్టేషన్ కంట్రోలర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి రెండు గంటలకోసారి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా వారిని ఆదేశించారు. "భద్రతా ఏజెన్సీల సలహా తర్వాత ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి పూర్తి డీఎంఆర్సీ నెట్ వర్క్ లో రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా ముంబైలోని సున్నితమైన ప్రాంతాలలో సైన్యం, స్థానిక పోలీసులు రంగంలోకి దించుతున్నామని" ఢిల్లీ మెట్రో జారీ చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.

ఢిల్లీ, చుట్టుప్రక్కల ఉన్న నగరాలకు వ్యాపించిన ఢిల్లీ మెట్రో నెట్ వర్క్ 327 కి.మీల పొడవు ఉంటుంది. "రెడ్ అలర్ట్ జారీ చేసిన తర్వాత అన్ని స్టేషన్ల కంట్రోలర్లు పార్కింగ్ ప్రదేశాలు సహా మొత్తం స్టేషన్ పరిసరాల్లో ఏవైనా అనుమానాస్పద వస్తువులు, చర్యలు కనిపిస్తాయేమో పర్యవేక్షించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ప్రతి రెండు గంటలకోసారి కంట్రోల్ రూమ్ కి చెప్పాలి" అని పేర్కొంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సాయంత్రం సైనిక దళాధిపతులతో దాదాపు గంట పాటు చర్చించారు. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఉన్నారు. ఉన్నతస్థాయి సమావేశం తర్వాత ఢిల్లీ మెట్రోకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రతి రెండు గంటలకు స్టేషన్ కంట్రోలర్లు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.