మరో 72 గంటల్లో తేల్చేస్తాం: పాక్‌ మంత్రి

SMTV Desk 2019-02-27 17:16:00  India, Pak Minister,

"భారత్‌తో యుద్ధం చేయాలా లేక శాంతిగా వ్యవహరించాలా అనే విషయం మరొక 72 గంటలలో తేల్చేస్తాము. కనుక ఈ 72 గంటలు చాలా కీలకమైనవి. ఒకవేళ భారత్‌-పాక్‌ మద్య యుద్ధం అంటూ జరిగితే అది రెండో ప్రపంచయుద్ధం కంటే పెద్దదిగా ఉండవచ్చు. ఇరుదేశాల మద్య యుద్దం జరిగితే ఆదే చిట్టచివరి యుద్ధం అవుతుంది. మరొక 72 గంటలలో ఏమి జరుగుతుందో తేలిపోతుంది," అని పాక్‌ రైల్వేమంత్రి షేక్ రషీద్ అహ్మద్ మీడియాకు తెలిపారు.

పాక్‌ మాజీ సైనికాధ్యక్షుడు, మాజీ పాక్‌ దేశాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఇటీవల ఒక తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “ఒకవేళ పాక్‌ మొట్టమొదట భారత్‌పై అణ్వస్త్రం ప్రయోగించినట్లయితే, భారత్‌ వరుసగా 20 అణ్వస్త్రాలను ప్రయోగించగలదు. వాటిని ఎదుర్కోగల శక్తి పాకిస్థాన్‌కు ఉందా?” అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న పాక్‌ వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది.

పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ప్రస్తుతం అణ్వస్త్ర ప్రయోగంపై నిర్ణయాత్మక కమిటీతో కీలకసమావేశం నిర్వహిస్తున్నారు. వారి సమావేశం తమ వాస్తవ పరిస్థితిని, తదనంతర పరిణామాలపై అంచనా వేసుకోవడానికికావచ్చు లేదా భారత్‌ మరియు ప్రపంచదేశాలపై ఒత్తిడి పెంచడానికి కావచ్చు. వాటిలో రెండవదే నిజమనుకోవచ్చు. భారత్‌ దాడుల తరువాత ఇమ్రాన్ ఖాన్‌ ప్రభుత్వం, నిత్యం ప్రగల్భాలు పలికే పాక్‌ సైనికాధికారులు ఇంటాబయటా తీవ్రఅవమానకర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే భారత్‌పై అణ్వస్త్రాలు ప్రయోగించే ఆలోచనలో ఉన్నామని ప్రపంచదేశాలను నమ్మించగలిగితే వెనక్కు తగ్గమని భారత్‌, పాక్‌లపై ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు ప్రపంచదేశాల అభ్యర్ధన మేరకు వెనక్కు తగ్గవలసి వచ్చిందని లేకుంటే భారత్‌ను చీల్చి చెండాడేసేవారమని లక్షణకుమారుడిలా ప్రగల్భాలు పలుకవచ్చు. ఈ అవమానకర పరిస్థితుల నుంచి బయటపడటానికి పాకిస్థాన్‌కు ఇంతకంటే మంచిమార్గం కనబడటం లేదు.