పాక్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు, అందుకే దాడి చేశాం

SMTV Desk 2019-02-27 10:02:48  Sushma Swaraj, Wang Yi, Sergey Lavrov, China, Russia, Meeting

చైనాలో జరుగుతున్న రష్యా-భారత్-చైనా త్రైపాక్షిక సదస్సులో భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, చైనా విదేశాంగమంత్రి వాంగ్ యి, రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రో పాల్గొన్నారు. కాగా, ఈ సదస్సులో భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ, ఉగ్రవాద సంస్థలపై పాకిస్తాన్ ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని, అందువల్లే తాము రంగంలోకి దిగాల్సి వచ్చిందన్నారు. పాకిస్తాన్ ఇప్పటికైనా ఉగ్రవాద స్థావరాలపై ఉక్కుపాదం మోపాలని, లేదంటే తమ పని తాము చేసుకుంటూ వెళ్తామని స్పష్టంచేశారు. వుజెన్‌లో 16వ విదేశాంగ మంత్రుల సమావేశంలో పుల్వామా ఉగ్రదాడిని ప్రస్తావించారు సుష్మా. పాకిస్తాన్ తోడ్పాటుతోనే జైషే మహ్మద్ సంస్థ తమ బలగాలపై దాడికి పాల్పడిందని వెల్లడించారు. జైషే మహ్మద్ సంస్థను ఐక్యరాజ్యసమితి నిషేధించినా, పాకిస్తాన్ ఇప్పటికీ సాయం చేస్తోందని మండిపడ్డారు.

ఈమధ్యే పుల్వామాలో భద్రతాబలగాలపై క్రూరమైన దాడి జరిగింది. పాకిస్తాన్ కేంద్రంగా నడిచే జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఆ దాడికి పాల్పడింది. యావత్ ప్రపంచం ఖండించినా పాకిస్తాన్ మాత్రం సీరియస్‌గా తీసుకోలేదు. పాక్ ప్రభుత్వం తమకేం తెలియదని చేతులు దులుపుకుంది. ఉగ్రవాదంపై పాకిస్తాన్ చర్యలు తీసుకోకపోవడం వల్లే మేం రంగంలోకి దిగాం. భారత్‌లో మరిన్ని దాడులకు జైషే మహ్మద్ కుట్రలు చేయడంతో ముందస్తు దాడి చేయాల్సి వచ్చింది. పాకిస్తాన్ పౌరులకు ఎలాంటి హాని చేయకుండా బాలాకోట్‌లో ఉగ్రవాద స్థావరాన్ని నేలమట్టం చేశారు. ఇది సైనిక చర్య కాదు. పాక్ మిలిటరీ స్థావరాలపై ఎలాంటి దాడులు చేయలేదు. ఉద్రిక్తతలను పెంచాలని భారత్ అనుకోవడం లేదు. కానీ ఉగ్రవాద నిర్మూలన కోసం మా చర్యలు కొనసాగుతాయి అని సుష్మ తెలిపారు.