మరోసారి ఉగ్రకలకలం, ఉగ్రవాదులు-భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు

SMTV Desk 2019-02-27 10:00:32  Terrorist, Bharath Soldiers, Attack, Jaish-e-mahammed

శ్రీనగర్, ఫిబ్రవరి 27: నిన్న జరిగిన ఉగ్రదాడి వల్ల ఆగ్రహంతో ఉన్న పాకిస్తాన్ భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రకలకలం రేగింది. షోపియన్ జిల్లా మేమండర్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్లో ఇద్దరు జైషే మహ్మద్ టెర్రరిస్టులు హతమయ్యారు. మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ముందుజాగ్రత్తగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఈ నెల 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడి తర్వాత కశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట చేపట్టాయి భద్రతాబలగాలు. ఇక తాజాగా పాకిస్తాన్‌లో భారత వైమానిక దాడుల నేపథ్యంలో, ఉగ్రదాడులు జరిగే అవకాశముందని నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ సందర్భంగా అన్ని చోట్లా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. షోపియన్ జిల్లా మేమండర్ ప్రాంతంలో ఓ ఇంట్లో ముగ్గురు టెర్రరిస్టులు తలదాచుకున్నారని సమాచారం వచ్చింది. వారిని మట్టుబెట్టేందుకు 23 పారా, సీఆర్‌పీఎఫ్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ రంగంలోకి దిగాయి. భద్రతాదళాలను చూసి ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో జవాన్లు ఎదురుకాల్పులకు దిగారు. ముందు జాగ్రత్తగా షోపియన్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

కాగా, ఎల్‌వోసీ వెంబడి పాకిస్తాన్ సైన్యం కాల్పులతో రెచ్చిపోతోంది. భారత వైమానిక దాడులను వైమానిక దాడులను జీర్ణించుకోలేక ఆగ్రహంతో ఊగిపోతోంది. ఈ క్రమంలోనే సరిహద్దు గ్రామాలు, భారత పోస్టులపై యథేచ్చగా కాల్పులు జరుపుతోది. పాకిస్తాన్ కవ్వింపులను దీటుగా తిప్పికొట్టిన భారత సైన్యం..5 పాకిస్తాన్ పోస్టులను ధ్వంసం చేసింది. ఈ దాడిలో పెద్ద మొత్తంలో పాకిస్తాన్ సైనికులు హతమయ్యారని సమాచారం.