భారత్ దాడులు చేసి జవాన్ల కుటుంబాలకు ఓదార్పు నిచ్చింది...

SMTV Desk 2019-02-27 09:57:49  Jammu Kashmir, People, Happiness, About the Attack, Terrorist

శ్రీనగర్, ఫిబ్రవరి 27: మంగళవారం తెల్లవారుజామున జరిపిన సర్జికల్‌ దాడుల తరువాత తమకు కొంత ఊరట కలిగిందని, ఇక ఉగ్రవాదాన్ని పూర్తిగా నాశనం చేయాలని పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబ సభ్యులు అభిప్రాయపడ్డారు. "భారత్‌, పాక్‌కు దీటైన సమాధానం ఇస్తుందని మేం ఎదురు చూస్తున్నాం. అది ఇప్పటికి నెరవేరింది. మాకు జరిగిన నష్టం పూడ్చలేనిది కానీ ఈ ఘటనతో మాకు కొంత ఓదార్పు దొరికింది" అని రాజసమంద్‌ జిల్లా బినోస్‌ గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్‌ జవాన్‌ నారాయణ్‌ లాల్‌ గుర్జార్‌ బంధువు మహేశ్‌ గుర్జార్‌ అన్నారు.

మరో జవాన్‌ రోహితేశ్‌ సోదరుడు జితేంద్ర "ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని యావత్తు దేశం సమర్థిస్తోంది" అని అన్నారు. ఉగ్ర శిబిరాలపై దాడుల తరువాత జవాన్‌ హెచ్‌.గురు స్వగ్రామమైన గుడిగిర్‌లో ఆ గ్రామస్తులు గౌరవార్థం ర్యాలీ నిర్వహించి, గురు ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. గురు తండ్రి మాట్లాడుతూ, "మేం శాంతిని కోరుకున్నాం. కానీ శాంతితో సమస్య పరిష్కారం కాదు. ఉగ్రవాదాన్ని పూర్తిగా నాశనం చేసినపుడే నా కుమారుడి ఆత్మకు శాంతి కలుగుతుంది" అని పేర్కొన్నారు. కన్నీటి పర్యంతమైన గురు భార్య కళావతి "వాయు సేనకు నేను సెల్యూట్‌ చేస్తున్నాను. వీరమరణం పొందిన జవాన్లకు ఈ చర్యతో శాంతి చేకూరుతుంది. భారత ఆర్మీ పట్ల నాకు గర్వంగా ఉంది" అని అన్నారు. ఉగ్రవాదులపై భారత వైమానిక దళం దాడులు చేసి జవాన్ల కుటుంబాలకు ఓదార్పు నిచ్చిందని జవాన్‌ కుల్వీందర్‌ సింగ్‌ తండ్రి దర్శన్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు.