తీవ్ర కసరత్తు తర్వత దాడి

SMTV Desk 2019-02-27 09:51:34  Attack, Pakisthan, 11 days, Plan, Pulwama

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై నిన్న(మంగళవారం) ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ వైమానిక దాడులు జరిపింది. పుల్వామాలో ఫిబ్రవరి 14న ఉగ్రదాడి జరిగితే, 11 రోజుల తర్వాత భారత్‌ ప్రతీకార దాడికి దిగింది. ఈ పదకొండు రోజులు తీవ్ర కసరత్తు చేసి దాడికి గట్టి వ్యూహాలు పన్నింది. నిజానికి పుల్వామా దాడి జరిగిన మరునాడే పాకిస్తాన్‌పై దాడికి సంబంధించి వైమానిక దళాధిపతి బీఎస్‌ ధనోవా ప్రజెంటేషన్‌ ఇచ్చారు. దానికి అప్పుడే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయినా కూడా తొందరపడకుండా ఆచితూచి తిరుగులేని వ్యూహాన్ని రూపొందించి దాడులు నిర్వహించింది.

కాగా, భారత వైమానిక దళం, సైన్యం కలిసి హెరాన్‌ డ్రోనులతో వాస్తవాధీన రేఖ పొడవునా ఆకాశం నుంచి నిఘా నిర్వహించాయి. దాడి చేయాల్సిన ప్రాంతాలను గుర్తిస్తూ వైమానిక దళం, నిఘా సంస్థలు టార్గెట్‌ టేబుల్స్‌ ను రూపొందించాయి. వైమానిక దళంలోని1వ స్క్వాడన్‌ టైగర్స్‌ ,7వ స్క్వాడ్రన్‌ బాటిల్‌ యాక్సెస్‌లను దాడులకు సిద్ధం చేశారు. రెండు మిరేజ్‌ స్క్వాడ్రన్లు, 12 జెట్‌ విమానాలను దాడులకు నియమించారు. ముందస్తుగాహెచ్చరించే భటిండాజెట్‌ విమానం, ఆగ్రా నుంచి తెప్పించిన ఆకాశంలోనే ఇంధనం నింపే విమానాలతో మధ్య భారతంపై ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. దాడుల కార్యక్రమం మొదలైంది. 12 మిరేజ్‌ 2000 యుద్ధ విమానాలు గ్వాలియర్‌ నుంచి విడతల వారీగా బయలుదేరాయి. వాటిలో లేజర్‌ గైడెడ్‌ బాంబులు ఉన్నాయి.

మిరేజ్‌ పైలట్లు చివరిసారిగా లక్ష్యాలను సరిచూసుకున్నారు. ముందుకు వెళ్లాల్సిందిగా కమాండ్‌ సెంటర్‌ నుంచి అనుమతి లభించింది. ముజఫరాబాద్‌ దగ్గర వాస్తవాధీన రేఖపై ఆ విమానాలు తక్కువ ఎత్తులో ప్రయాణించాయి. లేజర్‌ ప్యాడ్‌లను ఉపయోగించి లక్ష్యాలను గుర్తించి బాంబుల వర్షం కురిపించాయి.