భారత వాయుసేన బాలాకోట్ నే ఎందుకు ఎంచుకుందంటే..!

SMTV Desk 2019-02-26 17:34:00  pakistan, pok, blakot, iaf surgical strike

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఈ తెల్లవారుజామున జరిగిన ఎయిర్ స్ట్రైక్స్ లో ముఖ్యంగా పాక్ ప్రధాన భూభాగంలో ఉన్న బాలాకోట్ ను మన వాయుసేన టార్గెట్ చేసింది. అసలు బాలాకోట్ నే మన వాయుసేన లక్ష్యంగా చేసుకోవడానికి బలమైన కారణం ఉంది.

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ కు 195 కిలోమీటర్లు, ముజఫరాబాద్ కు 40 కిలోమీటర్ల దూరంలో బాలాకోట్ ఉంది. ఖైబర్ ఫక్తూంక్వా ప్రావిన్స్ లో బాలాకోట్ ఉంది. అంతర్జాతీయ విశ్లేషకుల ప్రకారం... పాకిస్థాన్ తాలిబాన్ పుట్టుకొచ్చిన తర్వాత, బాలాకోట్ పరిసర ప్రాంతాల్లోకి తన టెర్రరిస్టు క్యాంపుల్లో చాలా వాటిని జైషే మొహమ్మద్ తరలించింది.

2000-01లో బాలాకోట్ లో తన క్యాంపులను జైషే మొహమ్మద్ ప్రారంభించింది. ఈ ప్రాంతంలో జైషేకు సంబంధించిన అల్ రహ్మాన్ ట్రస్ట్ కార్యకలాపాలు కూడా విస్తృతంగా ఉన్నాయి. జైషే స్థావరాలు బాలాకోట్ పరిసర ప్రాంతాల్లో, పెషావర్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉన్న ముజఫరాబాద్ లలో ఉన్నాయి.

భారత ఇంటెలిజెన్స్ వర్గాల దృష్టిలో బాలాకోట్ ప్రాంతం జీహాద్ కు కేంద్ర స్థానం వంటిది. ఈ ప్రాంతం అమెరికా భద్రతాదళాల రాడార్ లో చాలా కాలంగా ఉంది. ఇక్కడున్న క్యాంపులు జైష్ అధినేత మసూద్ అజార్ మేనల్లుడు యూసుఫ్ అజార్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఆత్మాహుతి దళ సభ్యులకు కూడా ఇక్కడే ట్రైనింగ్ ఇస్తున్నారు. వీటన్నింటి నేపథ్యంలో, బాలాకోట్ నే భారతీయ వాయుసేన టార్గెట్ చేసి, ధ్వంసం చేసింది.