ఈవీఎంలో ’ట్రక్కు‘ గుర్తు ఔట్

SMTV Desk 2019-02-26 16:01:38  TRS Party, Central election commission, Etela rajender, Party symbols

హైదరాబాద్, ఫిబ్రవరి 26: మంగళవారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పలు విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కారు గుర్తును పోలి ఉన్న ట్రక్కు, ఇస్త్రీ పెట్టే గుర్తులను ఎన్నికల సంఘం తొలగించిందని అన్నారు. గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కారు గుర్తు పలుచగా ఉండటంతో చాలా మంది ఓటర్లు గందరగోళానికి గురయ్యారని ఆయన అన్నారు. కారు గుర్తును అందరికీ కనిపించేలా ఒత్తుగా బ్యాలెట్ పేపర్లో ప్రచురిస్తామని ఎన్నికల సంఘం తమకు హామీ ఇచ్చిందని ఆయన అన్నారు.

ట్రక్కు తో పాటు మరో నాలుగు గుర్తులను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించామన్నారు. కొన్ని చోట్ల తమ అభ్యర్థులు ఆ గుర్తుల వల్ల ఓడిపోయారని ఈటెల ఆరోపించారు. తమ పోరాటానికి ఎన్నికల సంఘం దిగి వచ్చిందని...కారును పోలిన ట్రక్కు గుర్తు, ఇస్త్రీ పెట్టె గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగిస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను స్వాగతిస్తున్నామని ..హర్షం ప్రకటిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఈటలతోపాటు కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.