నాకు తెలియకుండానే కళ్ళలో నీళ్ళు వచ్చాయి: ఎన్టీఆర్

SMTV Desk 2019-02-26 13:08:47  NTR, Kalyan Ram, 118, Guhan, Pre release event

హైదరాబాద్, ఫిబ్రవరి 26: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రముఖ కెమెరామెన్ గుహన్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 118 . అర్జున్ రెడ్డి ఫేం శాలిని పాండే, నివేదా థామస్ హీరొయిన్లుగా నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం నిన్న హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. "బాబాయి, తమ్ముడు నాకోసం రావడం సంతోషంగా ఉంది. ఈసారి సినిమా విడుదలైన తర్వాత మాట్లాడతా. 118 పై నాకు చాలా నమ్మకం ఉంది. ప్రతిసారి ఏదో ఒక కొత్త దనాన్ని మీ ముందు ఉంచాలనే తపనతో సినిమా చేస్తున్నా. కానీ ఓడిపోతున్నా. మిమ్మల్ని మెప్పించే వరకూ ఇలానే ప్రయత్నిస్తూ ఉంటాను" అన్నారు.

పుల్వామా ఉగ్రదాడిలో మృతి చెందిన వీర జవాన్ల ఆత్మకు, ఇటీవల కన్నుమూసిన తెలుగు సినీ దిగ్గజాలు విజయ్‌ బాపినీడు, కోడి రామకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించమని ఎన్టీఆర్‌ కోరారు. అందరూ కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ మాట్లాడుతూ.. "గుహన్‌ నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. ఆయన కెమెరామెన్‌గా ఉన్నప్పుడు మేం బాద్‌షా సినిమా కోసం కలిసి పనిచేశాం. ఆయన ఎంతో శ్రమించే వ్యక్తి. ఇపుడు అంతే గొప్పగా ఈ ‘118’ చిత్రం తీశారు. ఈ 118 చిత్రాన్ని నేను చూసాను… నివేదా చేసిన ఓ సీన్‌లో నాకు తెలియకుండానే నా కళ్ల నుంచి నీళ్లు రావడం మొదలైంది. నిజంగా ఈ జనరేషన్‌లో ఆమె ఓ గొప్ప నటి. షాలిని గారు కూడా చాలా కష్టపడ్డారు. ఈ చిత్ర విజయానికి వీరిద్దరూ కూడా కారణం కాబోతున్నారు" అని అన్నారు.