ఆన్‌లైన్లో ఓటింగ్ విధానం లేదు: ఎన్నికల సంఘం

SMTV Desk 2019-02-26 12:41:46  Online Voting, Election Commission, Social Media

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: భారత్ లో పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో విదేశాల్లో వున్న భారతీయులు తమ ఓటు హక్కును ఆన్‌లైన్లో వినియోగించుకోవచ్చు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా ఈ వార్తల్లో వాస్తవం లేదని, అలా ఆన్‌లైన్లో ఓటింగ్ విధానం లేదని భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని తెలిపింది. రానున్న ఎన్నికల నుండి భారతీయ ఎన్నారైలు ఆన్‌లైన్‌లో 6ఏ ఫామ్ నింపి ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందని, కానీ ఓటు వేయడానికి మాత్రం తాము నిర్ణయించుకున్న పోలింగ్ బూత్‌కి రావాల్సిందేనని చెప్పింది.

ఈ ఆన్‌లైన్ ఓటింగ్ గురించి సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం అందుతోందని, అలా ఓటు వేయడానికి ఎటువంటి వెబ్‌సైటు లేదని పేర్కొంది. అయితే ప్రవాస భారతీయులు ఓటు వేయడానికి వచ్చేవారు పాస్‌పోర్ట్ చూపించి ఓటు వేయవచ్చని తెలిపింది. ఆన్‌లైన్లో ఓటు వేయవచ్చు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా ఈసీ తెలిపింది. ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణ చేయకుండా ఎన్నారైలకు ఆన్‌లైన్లో ఓటు వేసే అవకాశం కల్పించలేమని ఇది ఇప్పట్లో జరగే పనికాదని స్పష్టం చేసింది.