మధ్యప్రదేశ్‌లో, ఉత్తరాఖండ్‌లో కూడా ఎస్‌పీ-బీఎస్‌పీ

SMTV Desk 2019-02-26 11:30:47  Akhilesh Yadav, Mayawati, SP, BSP, Alliance, Utthar Pradesh, Madhya Pradesh, Uttharkhand

లక్నో, ఫిబ్రవరి 26: కాంగ్రెస్ తో కూడా పొత్తు పెట్టుకోకుండా, ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీని గద్దె దించేందుకు సమాజ్‌వాదీ పార్టీ-బహుజన్‌ సమాజ్‌ పార్టీ(ఎస్‌పీ-బీఎస్‌పీ) కూటమిగా మారిన విషయం తెలిసిందే. ఎస్‌పీ-బీఎస్‌పీ ఉత్తరప్రదేశ్ లోనే కాకుండా మరో రెండు రాష్ట్రాల్లో పోటి చేయనున్నాయి. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో యూపీతోపాటు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోనూ కలిసి బరిలోకి దిగాలని ఈ రెండు పార్టీలు నిర్ణయించాయి. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్, బీఎస్‌పీ అధినేత్రి మాయావతి ఈ మేరకు సోమవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అందులో "2019 లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాం. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్, టికమ్‌గర్హ్, ఖజరహోతో పాటు ఉత్తరాఖండ్‌లోని గధ్వాల్‌ స్థానాల నుంచి సమాజ్‌వాదీ పార్టీ పోటీ చేయనుండగా మిగతా చోట్ల బీఎస్‌పీ తమ అభ్యర్థులను బరిలోకి దించుతుంది" అని పేర్కొనారు. మధ్యప్రదేశ్‌లో 29, ఉత్తరాఖండ్‌లో 5 ఎంపీ స్థానాలున్నాయి.

కాగా, బిహార్‌లోని మొత్తం 40 లోక్‌సభ స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీకి దిగాలని బీఎస్పీ నిర్ణయించిందని ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నేత, బిహార్‌ బిఎస్పీ ఇన్‌చార్జ్‌ లాల్జీ మేధ్కర్‌ సోమవారం వెల్లడించారు. బిహార్‌లో బీఎస్పీ టికెట్‌ ఆశావహులు, పార్టీ పథాధికారులతో గురువారం ఢిల్లీలో అధినేత్రి మాయవతితో సమావేశం ఉందని ఆయన తెలిపారు. ఎన్నికలకు సిద్ధం కావాల్సిందిగా ఆమె తమను ఇప్పటికే ఆదేశించారనీ, పూర్తి సూచనలు ఆమె గురువారం నాడు సమావేశంలో ఇచ్చే అవకాశం ఉందని మేధ్కర్‌ తెలిపారు. బిహార్‌లో ఇప్పటికే ఎన్డీయేతర పార్టీల మధ్య సఖ్యత లేదు. అటు కాంగ్రెస్‌ను, ఇటు ఆర్జేడీని కూడా వదిలేసి బీఎస్పీ ఒంటరిగా పోరుకు దిగాలనుకోవడం ఆ రెండు పార్టీలకూ దెబ్బేనని భావిస్తున్నారు.