కేసీఆర్‌కు, చంద్రబాబుకు మధ్య నక్కకు, నాగ లోకానికి మధ్య ఉన్నంత తేడా ఉంటుంది : కేటీఆర్

SMTV Desk 2019-02-25 18:52:47  KCR, KTR, Chandrababu, TDP, TRS

హైదరాబాద్, ఫిబ్రవరి 25: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయలో విమర్శించారు. సోమవారం టీఆర్ఎస్ భవనంలో పాలమూరు జిల్లాకు చెందిన పలు పార్టీల కార్యకర్తలు, నేతలు టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ముసుగు రాజకీయాలు, చీకటి రాజకీయాలపై పేటేంట్ హక్కు చంద్రబాబుకే ఉందని, తాము ఏం చేసినా డైరెక్టుగానే చేస్తామని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లను గెలిపిస్తే ఢిల్లీని గడగడలాడించి రాష్ట్రానికి దక్కాల్సిన వాటాను తీసుకొస్తామని అన్నారు. కేసీఆర్‌కు, చంద్రబాబుకు మధ్య నక్కకు, నాగ లోకానికి మధ్య తేడా ఉంటుందన్నారు. ఏపీలో తాము రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు.ఏపీలో టీడీపీ పాలన అంతం కావాలని ప్రజలు కోరుకొంటున్నారని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ స్వంతంగా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా రెండు సార్లు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. చంద్రబాబునాయుడు మాత్రం మామ పెట్టిన పార్టీలో చేరి నాయకుడుగా మారినట్టు చెప్పారు. స్వయం ప్రకాశం లేని నేత చంద్రబాబునాయుడు అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. దేవరకద్ర నియోజకవర్గంలోని 133 గ్రామ పంచాయితీల్లో 103 గ్రామ పంచాయితీలను టీఆర్ఎస్ కైవసం చేసుకొందని కేటీఆర్ చెప్పారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలమూరు జిల్లాకు చెందిన ప్రజలు చైతన్యవంతులై ఓటు చేసినందుకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉద్ధండులైన నేతలను ఈ ఎన్నికల్లో పాలమూరు ప్రజలు ఓడించి గట్టిగా బుద్ది చెప్పారని కేటీఆర్ చెప్పారు.ఇద్దరు ఎంపీలతో తెలంగాణ సాధించారని కేటీఆర్ గుర్తు చేసుకొన్నారు. మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్న సమయంలోనే కేసీఆర్ తెలంగాణ సాధించినట్టు చెప్పారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో మూడు ఎంపీ స్థానాలు దక్కే పరిస్థితి లేదని ఆయన ఎద్దేవా చేశారు. మోడీకి సంపూర్ణ మెజారిటీని ప్రజలు ఇస్తే ఏం మంచి పనులు చేశారని ఆయన ప్రశ్నించారు. దేశ ప్రజలు మోడీ పాలన పట్ల విసిగిపోయారని చెప్పారు. ఎక్కడ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటే ఆ రాష్ట్రాల్లో ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఓటు చేస్తున్నారని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏ పార్టీ లేకుండా కాంగ్రెస్ పార్టీ ఉంటే ఆ పార్టీకి ప్రజలు ఓటు చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లను గెలిపిస్తే రాష్ట్రానికి దక్కాల్సిన వాటాను తీసుకొస్తామని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాము, ముంగిసలు కలిసినట్టుగా కాంగ్రెస్, టీడీపీలు కలిసి పోటీ చేశాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా కూడ ప్రజలు టీఆర్ఎస్‌కు ఓటు చేశారని చెప్పారు.రైతు బంధు పథకం ద్వారా కేసీఆర్ రైతుల మనసు గెల్చుకొన్నారని మోడీ, చంద్రబాబునాయుడులు కాపీ కొట్టారని చెప్పారు. చంద్రబాబునాయుడు అన్ని పథకాలను టీఆర్ఎస్ ప్రవేశ పెట్టిన పథకాలను కాపీ కొడుతున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికలు వస్తున్నాయని భావించి చంద్రబాబునాయుడుకు రైతులు గుర్తుకు వచ్చారని కేటీఆర్ చెప్పారు.