60 గంటలు రైల్లో ఉత్తర కొరియా అధ్యక్షుడు

SMTV Desk 2019-02-25 12:54:07  Viyatnam, Kim Jong Un, Train journey, Donald Trump

ఉత్తర కొరియా, ఫిబ్రవరి 25: ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జాంగ్ ఉన్‌, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తో వియత్నాంలో భేటీ కానున్నట్లు ఉత్తర కొరియా ప్రభుత్వం తెలిపింది. ఈ రెండో విడత సమావేశం కోసం కిమ్ ఏకంగా రైలు ప్రయాణాన్ని ఎంచుకున్నారు. గతంలో కిమ్ తండ్రి, తాత కూడా విదేశీ పర్యటనలకు ఎక్కువగా రైల్లోనే ప్రయాణించేవారు. దీంతో ఈ దఫా కిమ్ వినూత్నంగా రైలు జర్నీకి పచ్చజెండా ఊపారు. కిమ్‌తోపాటు చర్చల వ్యూహకర్త జనరల్ కిమ్ యంగ్ చోల్, ఆయన సోదరి, ఇతర కీలక ఉన్నతాధికారులు శనివారం బయలుదేరారు. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్‌యాంగ్ నుంచి వియత్నాంకు దాదాపు 4వేల కి.మీ.దూరం ఉంటుంది. ఇందుకోసం కిమ్ సుమారు 60 గంటలు ప్రయాణించాల్సి ఉంటుంది.

చైనా మీదుగా కిమ్ ప్రయానిస్తున్నప్పటికీ ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఆయన భేటీకారని అధికారవర్గాలు తెలిపాయి. ప్యాంగ్‌యాంగ్‌ నుంచి బయలుదేరే ముందు కిమ్ సైనికవందనం స్వీకరించారు. అనంతరం ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన రైల్వేలో వెళుతున్న దృశ్యాల్ని అక్కడి మీడియా విడుదల చేసింది. అయితే, కిమ్ ప్రయాణిస్తున్న రూట్ మ్యాప్‌ను మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా విడుదల చేయలేదు. బుధ, గురువారాల్లో హనోయ్‌లో ట్రంప్-కిమ్‌ల రెండో భేటీ జరుగనున్నది. ఈ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సమావేశ వేదికలు, పట్టణంలోని ముఖ్య కూడళ్లను అమెరికా, ఉత్తర కొరియా, వియత్నాం పతాకాలు, పూలతో ప్రత్యేకంగా అలంకరించారు.