మేడారంలో భక్తుల సందడి

SMTV Desk 2019-02-25 12:44:48  Medaram, Sammakka, Saralamma, Rush, Devotees

వరంగల్, ఫిబ్రవరి 25: మేడారం సమ్మక్క-సారక్క దేవతలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ వరాల తల్లుల అనుగ్రహం పొందేందుకు భారిగా పోటీ పడ్డారు. అమ్మవార్ల గద్దెలను తాకేందుకు భక్తులు ఆరాట పడ్డారు. గత బుధవారం నిర్వహించిన మినీ జాతర కంటే ఎక్కువ మంది భక్తులు ఇవాళ వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. మొదటగా జంపన్నవాగులో ఏర్పాటు చేసిన షవర్ల కింద స్నానాలు ఆచరించి నాగులమ్మ, జంపన్నగద్దెలకు పూజలు నిర్వహించిన అనంతరం కళ్యాణకట్ట వద్ద తలనీలాలను సమర్పించి తల్లుల గద్దెల వద్దకు చేరుకుంటున్నారు. అమ్మవార్ల గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్త్రాలు, పూలు, పండ్లు సమర్పించి గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అనంతరం తల్లులకు యాటపోతులను, కోళ్లను సమర్పించి గద్దెల పరిసరాల్లో వంటలు చేసుకొని విందు భోజనాలు చేస్తున్నారు. మళ్లీ పెద్ద జాతరకు వస్తామమ్మా అంటూ ఇళ్లకు తిరుగు ప్రయాణం అవుతున్నారు.