అప్పటి నుండి ఒక్కోకరుగా ప్రాణాలు కోల్పోతున్నారు

SMTV Desk 2019-02-25 12:19:18  DSP, Aman Thakur, Soldier, Terrorist, Attack, Thurigam, Jaish-e-mahammed

శ్రీనగర్, ఫిబ్రవరి 25: ఆదివారం జమ్మూ కాశ్మీర్ లోని కుల్గామ్‌ జిల్లాలోని తురిగామ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘావర్గాలకు పక్కా సమాచారం అందింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ అమన్‌ ఠాకూర్‌ నేతృత్వంలోని పోలీస్, ఆర్మీ సంయుక్త బృందం ఘటనాస్థలికి బయలుదేరింది. దీంతో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య భీకర ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది.

అయితే తురిగామ్‌ను ఈ బృందం సమీపించగానే ఉగ్రవాదులు వీరిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో డీఎస్పీ అమన్‌ ఠాకూర్‌ మెడ భాగంలో బుల్లెట్‌ దూసుకుపోయింది. వెంటనే భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. జరిగిన ఈ ఎన్‌కౌంటర్లో ముగ్గురు జైషే మొహమ్మద్‌ ఉగ్రవాదులు హతం కాగా, పోలీస్‌ డీఎస్పీ, మరో జవాన్‌ ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనపై పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.......అమన్‌ ఠాకూర్‌తో పాటు హవల్దార్‌ సోంబీర్‌కు తీవ్రగాయాలు కాగా వారిని వెంటనే వాయుమార్గం ద్వారా ఆర్మీ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. అయితే, చికిత్స పొందుతూ వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారన్నారు.

తురిగామ్‌లో నక్కిన ముగ్గురు జైషే ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఓ ఆర్మీ మేజర్, ముగ్గురు సైనికులు గాయపడ్డారనీ, వీరి ఆరోగ్యం స్థిరంగా ఉందని పేర్కొన్నారు. అమన్‌ మృతిపై గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్, డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.