క్రైమ్: యువకుడిని కొట్టి యువతిని లాక్కెళ్లి....

SMTV Desk 2019-02-25 12:16:44  West Godavari, Andhra Prdesh, Murder

పశ్చిమ గోదావరి, ఫిబ్రవరి 25: ఇటీవల గుంటూరులో ప్రేమజంటపై జరిగిన దాడిని మరువక ముందే మరో ఇప్పుడు ఇంకో దారుణం చోటు చేసుకుంది. కొన్ని రోజుల క్రితం జ్యోతి, శ్రీనివాసరావులపై జరిగిన దాడిలో జ్యోతి మరణించిన సంగతి తెలిసిందే. అయితే ప్రియుడే ఆమెని హత్య చేసాడని పోలీసులు నిర్ధారించారు.

తాజాగా అదే తరహాలో ఆదివారం కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలోని బౌద్ధరామాల సందర్శనకు వచ్చిన ఓ ప్రేమజంటపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసారు. యువకుడిని తీవ్రంగా కొట్టి యువతిని లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోగా, యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు.

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువతిపై అత్యాచారం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బాధితులు భీమడోలు మండలం అజ్జవారి గూడెం వారిగా పోలీసులు గుర్తించారు. బౌద్ధారామాలు అటవీప్రాంతంలో ఉండడం, జనసంచారం తక్కువగా ఉండడం వల్లే దాడి జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.