వాళ్ల బండారాన్ని నేను బయటపెడతాడని వాళ్లకు తెలీదు: ప్రధాని మోదీ

SMTV Desk 2019-02-25 11:55:25  Narendra Modi, First Phase, PM-Kisan, Utthar Pradesh

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉత్తరప్రదేశ్‌ (యూపీ)లోని గోరఖ్‌పూర్‌లో ప్రారంభించారు. మొదటి విడతగా 1.01 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.2,000 డబ్బును ఆయన బదిలీ చేశారు. మిగిలిన రైతులకు కూడా త్వరలోనే అందజేయనున్నట్లు మోదీ తెలిపారు. ప్రతిపక్షాలకు పదేళ్లకు ఒకసారి మాత్రమే, ఎన్నికలకు ముందు రైతులు గుర్తొస్తారని మోదీ విమర్శించారు.

గోరఖ్‌పూర్‌లోని భారతీయ ఎరువుల కార్పొరేషన్‌కు చెందిన మైదానంలో మోదీ మాట్లాడుతూ "ఎన్నికలు వస్తున్నాయంటే ఓట్ల కోసం విపక్షాలు రైతు రుణమాఫీ ప్రకటిస్తారు. పదేళ్లకోసారి, ఎన్నికలప్పుడు మాత్రమే వాళ్లు వ్యవసాయదారులను గుర్తు చేసుకుంటారు. వాళ్ల బండారాన్ని ఈ సారి మోదీ బయటపెడతాడని వాళ్లకు తెలీదు" అని వ్యాఖ్యానించారు.

జై జవాన్ , జై కిసాన్‌ నినాదంతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ, తమ ప్రభుత్వం రూ. 75 వేల కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తోందనీ, ఇదేమీ తాము ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ కాదని తెలిపారు.

"రుణమాఫీ చేయడం సులభమే. మాకు అదే సౌకర్యంగా ఉండేది. రాజకీయ, ఎన్నికల ప్రయోజనాల కోసం మేం కూడా తాయిలాలను ప్రకటించి ఉండొచ్చు. కానీ అలాంటి పాపానికి మేం ఒడిగట్టలేం. రుణమాఫీ వల్ల కొంత మంది రైతులకే ప్రయోజనం దక్కుతుంది" అని మోదీ అన్నారు.

అలాగే, పీఎం-కిసాన్‌ పథకానికి అర్హులైన రైతుల జాబితాను పంపకుండా కొన్ని రాష్ట్రాలు రాజకీయాలు చేస్తున్నాయనీ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లోని వారికి రైతుల శాపం తగులుతుందని మోదీ పేర్కొన్నారు.

"రుణమాఫీపై కాంగ్రెస్‌ లక్ష్యంగా మోదీ విమర్శలు చేస్తూ, పదేళ్లలో కేవలం రూ. 52 వేల కోట్ల రుణాలను వారు మాఫీ చేశారు. ఇక నుంచి మా ప్రభుత్వం ప్రతీ ఏడాది రైతులకు ఏటా రూ. 75 వేల కోట్లు ఇవ్వనుంది. పంటల కనీస మద్దతు ధర పెంపు అంశాన్ని కాంగ్రెస్‌ పట్టించుకోలేదు. 2007 నుంచి ఆ దస్త్రం కదలలేదు. దీంతో రైతులు అప్పులు చేయాల్సి వచ్చింది. రైతులకు మంచి చేయాలన్న ఉద్దేశ్యం గత ప్రభుత్వాలకు లేదు. కాబట్టే వారు సరైన నిర్ణయాలను తీసుకోలేదు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు అందుబాటులో అన్ని వనరులను వినియోగించుకుంటాం" అని మోదీ విమర్శించారు.