సౌతాఫ్రికా గడ్డపై చరిత్ర సృష్టించిన శ్రీలంక....

SMTV Desk 2019-02-23 20:03:49  South africa VS Srilanka, Test match, Srilanka historical record

దక్షిణాఫ్రికా, ఫిబ్రవరి 23: పోర్ట్ ఎలిజిబెత్‌ వేదికగా సౌతాఫ్రికా, శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్‌లో శ్రీలంక జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న శ్రీలంక జట్టు రెండు టెస్టుల సిరీస్‌ని 2-0తో చేజిక్కించుకుంది. దక్షిణాఫ్రికా గడ్డపై ఓ ఆసియా జట్టు టెస్టు సిరీస్ గెలుపొందడం ఇదే మొదటిసారి. గత ఆదివారం ముగిసిన తొలి టెస్టులో శ్రీలంక ఒక వికెట్ తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. గురువారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 222 పరుగులకి ఆలౌటైంది. ఆ జట్టులో డికాక్ (86:87 బంతుల్లో 12x4), మకరమ్ (60: 116 బంతుల్లో 9x4) అర్ధశతకాలు సాధించారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక జట్టు పేలవంగా 154 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో.. 68 పరుగుల ఆధిక్యం సఫారీలకి లభించింది.

మొదటి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం లభించినప్పటికీ సౌతాఫ్రికా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫలమైంది. ఆ జట్టులో కెప్టెన్ డుప్లెసిస్ (50 నాటౌట్: 70 బంతుల్లో 7x4) అజేయ అర్ధశతకంతో క్రీజులో నిలిచినా.. అతనికి సహకరించే లేకుండా పోయారు. దీంతో.. ఆ జట్టు 128 పరుగులకే ఆలౌటైంది. 197 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక జట్టు అలవోకగా విజయాన్ని అందుకుంది. ఫెర్నాండో (75 నాటౌట్: 106 బంతుల్లో 10x4, 2x6), కుశాల్ మెండిస్ (84 నాటౌట్: 110 బంతుల్లో 13x4) అజేయ అర్ధశతకాలు సాధించడంతో 45.4 ఓవర్లోనే 197/2తో విజయాన్ని అందుకుంది.