ఎగ్జామ్స్‌లో కాపీ కొట్టనివ్వడంలేదని 6 లక్షల మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు

SMTV Desk 2019-02-23 19:21:26  Uttarpradesh board exams, Students absent, Mass copying, CC cameras

ఉత్తరప్రదేశ్, ఫిబ్రవరి 23: యూపి బోర్డ్ టెన్త్, ప్లస్ 2 తరగతి పరీక్షల్లో కఠిన నిబంధనలను అమలు చేయడంతో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతోంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 6 లక్షల మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇప్పటికే పరీక్షల్లో కాపీ కొట్టేందుకు ప్రయత్నించిన 252 మంది విద్యార్థులను అధికారులు పట్టుకున్నారు. శుక్రవారం సైతం 18 మంది విద్యార్థులను పట్టుకుని ఇంటికి పంపించారు. మాస్ కాపీయింగ్‌ను నిర్మూలించడంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డు (యూపీఎస్‌ఈబీ) ఈ ఏడాది పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చింది. గతేడాది కంటే ఎక్కువగా కఠిన నిబంధనలు అమలు చేయడంతో పరీక్షలకు గైర్హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య పెరిగిపోతోంది. బోర్డు పరీక్షలు ముగిసేనాటికి గైర్హాజరయ్యే విద్యార్థుల సంఖ్య 9 లక్షలకు చేరే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది మొత్తంగా 58,06,922 మంది విద్యార్థులు బోర్డు ఎగ్జామ్స్‌కు రిజిస్టర్ చేసుకోగా అందులో టెన్త్ విద్యార్థులు 31,95,603 మంది ఉన్నారు. యూపీసెకండరీబోర్డ్ ఎగ్జామ్స్ సెక్రటరీ నీనా శ్రీవాస్తవ మాట్లాడుతూ.. పరీక్షలు స్ట్రిక్ట్‌గా నిర్వహించినందున విద్యార్థుల గైర్హాజరు శాతం పెరిగిపోతుందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి పరీక్షకు దరఖాస్తు విద్యార్తుల సంఖ్య ఏడాది కేవలం 6300కు చేరుకుందని, గతేడాది ఈ సంఖ్య 1.12 లక్షలు అని వివరించారు.