నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన కేజ్రీవాల్

SMTV Desk 2019-02-23 18:50:22  Arvind Kejriwal, Chief Minister of the Delhi, Central government, BJP, Aam Aadmi Party, state government

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న పార్టీ ప్రభుత్వ పెత్తనం కంటే కేంద్ర ప్రభుత్వ పెత్తనమే ఎక్కువగా ఉంది అని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి1 వ తేదీ నుండి దీక్ష చేపట్టనున్నట్లు అసెంబ్లీ సాక్షిగా కేజ్రీవాల్ ప్రకటించారు. డిల్లీ ప్రజలంతా సంపూర్ణ డిల్లీ రాష్ట్రం కోసం ఓ ఉద్యమం నిర్మించాల్సిన అవసరముందని ఈయన పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రజాస్వామ్యబద్దమైన పాలన కొనసాగుతోందని...ఒక్క డిల్లీలోనే అలా జరగడం లేదన్నారు. డిల్లీ ప్రజల ఓట్ల ద్వారా ఏర్పడిన ప్రభుత్వానికి ఎలాంటి అధికారులు లేకుండా కేంద్రం పెత్తనం కొనసాగడం ఏంటని ప్రశ్నించారు. సంపూర్ణ రాష్ట్రంగా డిల్లీ ఏర్పడితేనే ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రభుత్వానికి అధికారాలు లభిస్తాయని...అందుకోసమే ధీక్ష చేపడుతున్నట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు. కేంద్రం నుండి సంపూర్ణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెలువడే వరకు తన ధీక్ష కొనసాగుతుందని ఢిల్లీ సీఎం స్పష్టం చేశారు. బిజెపి, కాంగ్రెస్ రెండు పార్టీలు గత కొన్నేళ్లుగా డిల్లీని సంపూర్ణ రాష్ట్రంగా ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చి మోసం చేశాయని...ఈసారి మాత్రం తప్పనిసరిగా ఏర్పాటుచేయాల్సిందేనని డిమాండ్ చేశారు. పూర్తిస్థాయి రాష్ట్రంగా డిల్లీ అవతరిస్తే అభివృద్దితో పాటు స్థానిక యువతకు ఉద్యోగాలు, ప్రజలకు ఇళ్లు, మహిళలకు రక్షణ లభిస్తాయని కేజ్రీవాల్ తెలిపారు. అందుకోసం తన నిరాహార ధీక్షకు ప్రజలు మద్దతివ్వాలని ఆయన కోరారు.