జబర్దస్త్ బూతు షో కాదు : నాగబాబు

SMTV Desk 2019-02-22 17:15:13  Jabardast, Nagababu, Chammak Chandra

హైదరాబాద్, ఫిబ్రవరి 22: బుల్లి తెరపై కొన్ని సంవత్సరాలుగా జబర్దస్త్ నెంబర్ వన్ కామెడీ షోగా కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలో జబర్దస్త్ బాగా గాడి తప్పిందని ఇందులో బూతు కామెడీ ఎక్కువగా వస్తుందని విమర్శలు వస్తున్నాయి. ఈ షో చూసి ఆనందించేవాళ్ళ కన్నా అందులోని అడల్ట్ కామెడీని విమర్శించేవారే ఎక్కువ. ఈ విమర్శలపై జబర్దస్త్ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న నాగబాబు స్పందించారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ అందరూ అనుకుంటున్నట్లు జబర్దస్త్ బూతు షో కాదని ఇందులో చాలా క్లీన్ కామెడీ వస్తుందని అంటున్నాడు. కొన్ని కోట్లమంది మనసారా నవ్వుకుంటున్నారని ఇలాంటి షోపై అభాండాలు వేయడం మంచిది కాదని అంటున్నాడు.

ఒకప్పుడు నిజంగానే కాస్త అడల్ట్ కామెడీ వచ్చినా కూడా ఈ మధ్య కాలంలో అది పూర్తిగా తగ్గిపోయింది అన్నాడు నాగబాబు. ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ లో ఒక్క చమ్మక్ చంద్ర మాత్రమే కాస్త అడల్ట్ కంటెంట్ తీసుకొని కామెడీ చేస్తాడు కానీ మిగిలిన వాళ్ళంతా చాలా క్లీన్ కామెడీ చేస్తున్నారని సర్టిఫికెట్ ఇచ్చాడు నాగబాబు. బయట వస్తున్న బూతు కామెడీ షోలు సినిమాలతో పోలిస్తే జబర్దస్త్ చాలా ఉత్తమంగా ఉందని అంటున్నాడు. ఈ షో పై లేనిపోని కామెంట్లు చేసి రేటింగ్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని కానీ అది ఎప్పటికీ జరగదని నాగబాబు పేర్కొన్నాడు.